జగన్ ‘భజన’ చేస్తున్న పవన్

First Published Dec 9, 2017, 2:19 PM IST
Highlights
  • మూడు రోజులుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటలు వింటుంటే చాలా విచిత్రంగా ఉంది.

మూడు రోజులుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటలు వింటుంటే చాలా విచిత్రంగా ఉంది. పవన్ మాటల్లో రెండు విషయాలు స్పష్టంగా కనబడుతోంది. మొదటిది వీలైనంతలో చంద్రబాబునాయుడు పేరు ప్రస్తావించకుండా ఉండటం. ఇక, రెండోది వీలైనన్ని సార్లు ప్రధాన ప్రతిపక్షం వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పేరును హైలైట్ చేయటం. వినేవాళ్ళకు ‘పవన్ ఏంటి  జగన్ గురించి ఇన్ని సార్లు ప్రస్తావిస్తున్నారు’ అని కూడా అనిపించింది. నిజానికి ఈ విషయం పైకి చాలా సింపుల్ గా కనబడుతున్నా పవన్ మాటల వెనుక పెద్ద వ్యూహమే ఉంది.

ఇంతకీ విషయమేంటంటే, చంద్రబాబుకు ఇబ్బందులు కల్గించిన ఏ అంశాన్ని ప్రస్తావించాల్సి వచ్చినా, పవన్ వైసిపి లేదా జగన్ పేరును మాత్రమే చెబుతున్నారు. కావాలంటే జాగ్రత్తగా గమనించండి. మూడు రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో పర్యటించిన పవన్ అనేక సమావేశాల్లో ప్రసంగించారు. మొత్తం మీద వైసిపి లేదా జగన్ పేరును సుమారుగా వందసార్లైనా ప్రస్తావించి ఉంటారు. ఎందుకు అలా ప్రస్తావించారు?

అంటే, రాష్ట్రంలో గడచిన మూడున్నరేళ్ళలో చంద్రబాబు ఇబ్బంది పడ్డ సందర్భాలు చాలా ఉన్నాయ్. విభజన హామీల అమలు కావచ్చు, మరోటి కావచ్చు. ప్రత్యేకహోదా విషయమే తీసుకుంటే,  ఇవ్వాల్సింది ప్రధానమంత్రే.  కానీ ఒత్తిడి పెట్టటంలో చంద్రబాబు విఫలమయ్యారు. ఇక, రాజధాని నిర్మాణం ఏ దశలో ఉందో కూడా తెలీదు. పోలవరం ప్రాజెక్టు వివాదాల్లో కూరుకుపోయింది. అందుకే కేంద్ర-రాష్ట్రాల మధ్య బ్లేమ్ గేమ్ మొదలైంది.

సరే ఈ విషయాలను పక్కన పెడితే, అవినీతి అన్నది తీవ్రస్ధాయికి చేరుకుంది. ఈ విషయాన్ని జాతీయస్ధాయి సర్వేసంస్దలే స్పష్టం చేసాయి. ఏ విషయంలోనూ చంద్రబాబుకు కేంద్ర ప్రభుత్వం సహకరించటం లేదు. దాంతో ఒడ్డునపడ్డ చేపలాగ చంద్రబాబు గిలగిల కొట్టుకుంటున్నారు. అది..చంద్రబాబు పరిస్ధితి.

ఇక, జగన్ విషయం చూస్తే, ప్రత్యేకహోదా విషయంలో అనేక సదస్సులు నిర్వహించారు. ప్రతిపక్షాలను కలుపుకుని అనేక ఆందోళనలు చేసారు. వివిధ ప్రాంతాల్లో దీక్షలు కూడా చేసారు. అసెంబ్లీలో కూడా చాలా సార్లు మాట్లాడారు. ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై చంద్రబాబును వైసిపి ఎండగడుతూనే ఉంది. సందర్భం వచ్చినపుడల్లా ప్రభుత్వాన్ని వైసిపి దుమ్ము దులిపేస్తోంది. ప్రస్తుతం జగన్ పాదయాత్రలో చేస్తున్నది కూడా అదే.

ఇక్కడే పవన్ వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ఎక్కడ మాట్లాడాల్సి వచ్చినా చంద్రబాబు పేరును కాకుండా కేవలం జగన్ లేదా వైసిపిని మాత్రమే ప్రస్తావిస్తున్నారు. ప్రతీ అంశంలోనూ ప్రతిపక్షంగా వైసిపి విఫలమైంది అంటున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు వైఫల్యాన్ని పవన్ వ్యూహాత్మకంగా జగన్ పైకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టే మూడు రోజులుగా జగన్ పేరును పదే పదే ప్రస్తావిస్తున్నారు ‘రామభజన’ లాగ.

 

click me!