
Pawan Kalyan: ఆంధ్ర రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి మార్గంలో నిలపడానికి కూటమి ప్రభుత్వం దృఢంగా ముందడుగు వేసిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏడాది విజయవంతంగా పూర్తి చేసుకోవడంపై పవన్ స్పందిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వమైన వైఎస్ఆర్సీపీ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కున్నారని తెలిపారు. అధికారులే భయంతో పనిచేశారనీ, చంద్రబాబునాయుడిని అనేక మార్గాల్లో వేధించారని గుర్తు చేశారు. ఆ సమయంలో అసలు ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉందా అనే అనుమానం వచ్చేదని ఆవేదన వ్యక్తం చేశారు.
“ఏడాది కాలంలోనే రూ. 4 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రాబట్టగలిగాం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సీఎం చంద్రబాబు గాడిలో పెడుతున్నారు. పల్లె పండగల ద్వారా గ్రామీణ రోడ్లకు నవచేతన తీసుకొచ్చాం. గ్రామపంచాయతీలకు నిధుల మంజూరుతో గ్రామీణాభివృద్ధికి బలం చేకూరింది” అని పవన్ అన్నారు.
వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చిందని విమర్శించారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా అదే తీరును కొనసాగిస్తోందని పవన్ ధ్వజమెత్తారు. “బెదిరింపులు, గొంతులు కోస్తామనే పిచ్చి వ్యాఖ్యలు.. ఇవన్నీ ప్రజల్ని భయపెట్టే ప్రయత్నాలు. మేము శాంతి భద్రతలను అత్యంత ప్రాముఖ్యతతో చూస్తాం. పిచ్చివేషాలు వేస్తే తొక్కిపట్టి నార తీస్తాం” అని పవన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
జగన్ మోహన్ రెడ్డి ‘రప్పా రప్పా’ వ్యాఖ్యలు అసహనాన్ని కలిగిస్తున్నాయని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి భాషను వినడం సిగ్గుచేటుగా పేర్కొన్నారు. “మా మీద పిచ్చి బెదిరింపులు చేస్తే మేము ఎక్కడ ఉన్నా వెనక్కి తగ్గం. ప్రభుత్వ విధానాలు సంస్కారబద్ధంగా ఉంటేనే ప్రజలకి భరోసా కలుగుతుంది” అని పవన్ అన్నారు.
పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధిపై పవన్ విశేషంగా ప్రస్తావించారు. “గ్రామీణ ఉపాధి హామీ ద్వారా లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించాం. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టాం. రాష్ట్రంలోని సరిహద్దు జిల్లాల్లో జంతువుల వల్ల ఏర్పడుతున్న సమస్యలను పరిష్కరించాం” అని చెప్పారు.
“మాది మంచి పాలన. ఇది మెతక ప్రభుత్వం కాదు. అభివృద్ధికి కృషి చేసే ప్రభుత్వం. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. పాలనలో పారదర్శకత, చట్టబద్ధతే మాకు మార్గదర్శకం” అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సంఘవిద్రోహ శక్తులు, శాంతికి విఘాతం కలిగించే వారు ఎవరైనా వారిపై చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.