65ఏళ్లు వచ్చినా.. చంద్రబాబుకి కోరిక తీరలేదంటున్న పవన్

First Published Jul 9, 2018, 11:11 AM IST
Highlights

2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు మంచి జరుగుతుందని తాను నమ్మానని.. కాకపోతే వారు ప్రజలకు చేసింది సున్నా అని పవన్ అన్నారు.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి విమర్శల వర్షం కురిపించారు. ప్రస్తుతం విశాఖ పర్యటనలో ఉన్న పవన్.. అధికార  పార్టీ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు మంచి జరుగుతుందని తాను నమ్మానని.. కాకపోతే వారు ప్రజలకు చేసింది సున్నా అని పవన్ అన్నారు.

65 ఏళ్ల వయసులో కూడా చంద్రబాబుకి పదవి మీద వ్యామోహం చావలేదని పవన్ ఎద్దేవా చేశారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర విషయంలో తనకు ఎంతగానో బాధగా ఉందని.. విజయనగరానికి చెందిన 44 వేలమంది కార్మికులు ఉపాధి లేక వివిధ ప్రాంతాలకు వలస పోయారని.. అలాగే వేలమంది జూట్ కార్మికులు రోడ్డున పడ్డారని.. ఈ సమస్యలపై ప్రభుత్వ వైఖరి ఏంటో తనకు తెలియజేయాలని పవన్ అన్నారు. ఈ సందర్భంగా పవన్, చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ పై కూడా పలు విమర్శలు చేశారు. ప్రత్యక్ష ఎన్నికలలో లోకేష్ గెలుస్తాడని తన తండ్రికే నమ్మకం లేదని.. అందుకే పరోక్షంగా చంద్రబాబు తన కొడుక్కి మంత్రి పదవి కట్టబెట్టారని పవన్ ఆరోపించారు. 

తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు భావజాలం అనేదే లేదని.. కానీ జనసేనకు అది పుష్కలంగా ఉందని పవన్ అభిప్రాయపడ్డారు. ఉద్దానం సమస్య గానీ... తుమ్మపాల షుగర్ ఫ్యా్క్టరీ విషయం గానీ తాను వెళ్లి చూసి వచ్చి సమీక్ష జరిపితే గానీ.. ప్రభుత్వానికి తెలియలేదని పవన్ ఆరోపించారు. తాను ఎన్నికల్లో గెలిచినా, గెలవకపోయినా యువతకు, అణగారిన వర్గాలకు జనసేన అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ తెలియజేశారు. తన పార్టీ రాజకీయాల్లో సమూల మార్పు తీసుకొస్తుందన్నారు. 

click me!