
చంద్రబాబునాయుడుకు ప్రజాస్వామ్యంపై ఎంత గౌరవం ఉందో అర్ధమవుతోంది. నియోజకవర్గంలో ఎంఎల్ఏగా గెలిచిన వారిని కాదని ఇతరుల పేర్లతో పనులు, నిధులు మంజూరు చేయటం చంద్రబాబు పాలనతోనే మొదలేమో. ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడు నియోజకవర్గానికి ఎంఎల్ఏ సురేష్. వైసీపీ నుండి గెలిచారు. కానీ ఆ నియోజకవర్గంలో పనులన్నీ నియోజకవర్గంలో టిడిపి నేత బిఎన్ విజయకుమార్ పేరుతోనే మంజూరవుతాయి. తాజాగా ఓ రెండు కోట్ల రూపాయల విలువ పనులను సంతనూతలపాడు ఎంఎల్ఏ విజయకుమార్ అని పేర్కొంటూ ఏకంగా ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
గతంలో వైసీపీ తరపున గెలిచిన భూమా కుటుంబం పట్ల కూడా ఇదే విధంగ ప్రభుత్వం వ్యవహరించింది. ఆళ్ళగడ్డలో వైసీపీ తరపున భూమా అఖిలప్రియ ఎంఎల్ఏగా ఉండేవారు. అప్పట్లో నియోజకవర్గంలో మంజూరయ్యే పనులు, నిధులను ఆళ్ళగడ్డ టిడిపి ఇన్ ఛార్జ్ గంగుల ప్రభాకర్ రెడ్డినే ఎంఎల్ఏగా పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసేది. వైసీపీ ఎంఎల్ఏలను ఏమాత్రం పట్టించుకోకుండా మొత్తం పనులన్నింటినీ టిడిపి ఇన్ ఛార్జిల పేరుతోనే విడుదల చేస్తున్నారు. కనీసం ప్రోటోకాల్ కూడా పాటించటం లేదని వైసీపీ ఎంఎల్ఏలు మొత్తుకుంటున్నా ప్రభుత్వ ఏమాత్రం ఖాతరు చేయటం లేదు. ఫిరాయింపులను ప్రోత్సహించటం, ఫిరాయింపు ఎంఎల్ఏలతో రాజీనామాలు చేయించకపోవటంతో పాటు ప్రతిపక్ష ఎంఎల్ఏలను గుర్తించకపోవటం లాంటి చర్యలతో మొత్తం మీద ప్రజాస్వామ్యం పట్ల తనకున్న గౌరవాన్ని చంద్రబాబు అనేక విధాలుగా నిరూపించుకుంటూన్నారు.