
కుక్కను చంపాలంటే ముందు దానికి పిచ్చి అని ముద్రవేయాలి. అటువంటి ముద్రవేయటంలో చంద్రబాబునాయుడుది అందె వేసిన చేయి. ఒకరిని పక్కన బెట్టాలన్నా, మరకొరిని అందలం ఎక్కించాలన్నా అదే ఒరవడిని అనుసరిస్తారు. ఇపుడిదంతా ఎందుకంటే, కొడుకు లోకేష్ ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని అనుకున్నారు. ఆ విషయాన్ని తన నోటితో నేరుగా ఎవరికీ చెప్పకుండా పార్టీ నేతలతోనే డిమాండ్లు చేయించారు. ఫైనల్ గా లోకేష్ ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు.
అదేవిధంగా ఎవరినైనా మంత్రివర్గంలో నుండి తొలగించాలంటే కూడా చంద్రబాబుది అదే పద్దతి. అందుకు ఉదాహరణ రావెల కిషోర్ బాబే. వివిధ కారణాల వల్ల రావెలను మంత్రివర్గంలో నుండి తొలగించాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా రావెల ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, పార్టీ మారిపోవటానికి నిశ్చయించుకున్నారని కథనాలు రాయిస్తారు. లోకేష్ ను మంత్రివర్గంలోకి తీసుకోవాలంటేనేమో నేతలతో డిమాండ్లు చేయిస్తారు. రావెలను తొలగించాలంటే మాత్రం మీడియాలో కథనాలు రాయిస్తారు.
గుంటూరు జిల్లాకు చెందిన రావెల ఎస్సీ. అందునా రైల్వేల్లో ఉన్నతోధ్యోగి. దానికితోడు బాగా స్పీడున్నోడు. మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసారు. గెలిచారు, ఏకంగా మంత్రయ్యారు. అక్కడి నుండి రావెల మరింత స్పీడ్ అయ్యారు. దాంతో బలమైన సామాజికవర్గానికి కంటకింపుగా తయారయ్యారు. అదే సమయంలో తన స్పీడ్ తో వివాదాల్లోనూ ఇరుకున్నారు. ఇంటా, బయటా వివాదాలు ముసురుకున్నాయ్. ఇంకేముంది, బలమైన సామాజికవర్గానికి మంచి ఆయుధం దొరికింది. అన్నీరకాలుగా ఉపయోగించుకుని చంద్రబాబు నెత్తిన కూర్చుని రావెల తొలగింపుకు రంగం సిద్ధమైంది. అందుకనే రావెలపై వ్యతిరేకంగా పదే పదే కథనాలు వచ్చాయి. మంత్రివర్గం నుండి ఉధ్వాసనకు దారితీసాయి.