ఇదేం బాదుడు బాబోయ్...

First Published Jan 12, 2017, 5:58 AM IST
Highlights

టిడిపి ఎంపి కేశినేని స్వయంగా కేశినాని ట్రావెల్స్ కు అధిపతి. దివాకర్ ట్రావెల్స్ అధిపతి టిడిపి ఎంపి జెసి దివాకర్ రెడ్డేనని అందరికీ తెలిసిందే. ఇక, ప్రైవేటు ట్రావెల్స్ ను ప్రభుత్వం అదుపు చేస్తుందని అనుకుంటే అంతకన్నా అమాయకత్వం ఇంకోటి ఉండదు.

ప్రయాణీకుల జేబులు గుల్లైపోతున్నాయి. పండగలు వస్తున్నాయంటే చాలు ప్రైవేటు బస్సు ఆపరేట్లర్లకు పండగే పండగ. అప్పటి వరకూ సాధారణంగా ఉన్న బస్సు ఛార్జీలు ఒక్కసారిగా మోతెక్కిపోతాయి. బస్సు టిక్కట్ల ధరలు ఓల్వో బస్సంత వేగంగా పెరిగిపోతాయి. బస్సు టిక్కెట్ల చార్జీలను పెంచటంలో ఆర్టీసి కూడా ప్రైవేటు ఆపరేటర్లతో పోటీ పడుతుండటం విచిత్రం.

 

శుక్రవారం నుండి ప్రారంభంకానున్న సంక్రాంతి పండుగకు తమ ఊర్లకు వెళ్లాలనుకున్నవారి జేబులు గుల్లైపోతున్నాయి. బస్సెక్కితే ప్రయాణీకులను ఆపరటర్లు బాదేస్తున్నారు. ఒకరు, ఇద్దరో అనుకుంటే బస్సుకింద పడ్డట్లే. మొత్తం ఆపరేట్లర్లందరికీ ఒకే బాట కాబట్టి వారు చెప్పిన ధరలకే టిక్కెట్లు కొనక తప్పటం లేదు. ప్రయాణీకులను ఆపరేటర్లు నిలువుదోపిడీ చేస్తున్నా ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తుండటం విశేషం.

 

పండగల సందర్భాల్లో అదనపు ఛార్జీలు పెంచే విషయంలో విజయవాడలో ఇటీవలే సమావేశం నిర్వహించి అధికారులు నిబంధనలు విధించారు. అత్యధికంగా 30 శాతం కన్నా అదనపు ఛార్జీలు వసూళ్ళు చేయకూడదని చెప్పినా ఎవరూ లెక్క చేయటం లేదు. ఎందుకంటే, చాలా మంది ఆపరేటర్లకు ఉన్న రాజకీయ మద్దతే కారణం. టిడిపి ఎంపి కేశినేని స్వయంగా కేశినాని ట్రావెల్స్ కు అధిపతి. ఇక, ప్రైవేటు ట్రావెల్స్ ను ప్రభుత్వం అదుపు చేస్తుందని అనుకుంటే అంతకన్నా అమాయకత్వం ఇంకోటి ఉండదు. దివాకర్ ట్రావెల్స్ అధిపతి టిడిపి ఎంపి జెసి దివాకర్ రెడ్డేనని అందరికీ తెలిసిందే.

 

మామూలు రోజుల్లో హైదరాబాద్-అమలాపురం మధ్య రూ. 570 ఉన్న టిక్కెట్ల ధర ఇపుడు రూ. 1340. హైదరాబాద్-విజయవాడ మధ్య ఓల్వో సెమీ స్లీపర్ ఏసి బస్సు ఛార్జి రూ. 735 నుండి రూ. 2400కి పెరిగిపోయింది. హైదారాబాద్-విశాఖపట్నం మధ్య ఏసి మల్టీయాక్సల్ బస్సులో టిక్కెట్ ధర రూ. 1500 నుండి రూ. 2500కి వెళ్లిపోయింది. హైదరాబాద్-బెంగుళూరు మధ్య అయితే స్లీపర్ టిక్కెట్ ధర ఏకంగా రూ. 3 వేలు దాటిపోయింది.

 

ఏరకమైన బస్సైనా టిక్కెట్లు దొరికితే చాలని ప్రయాణీకులు అనుకుంటారు. దాంతో ప్రయాణీకుల అవసరం ప్రైవేటు ఆపరేట్లరతో పాటు చివరకు ఆర్టీసికి కూడా వరంగా మారింది. దాంతో ఇటు ఆర్టీసి అటు ప్రైవేటు ఆపరేటర్లు పోటీలు పడి మరీ ప్రయాణీకులను దోచేస్తున్నారు.

 

 

 

click me!