పాశర్లపూడి వద్ద ఓఎన్‌జీసీ గ్యాస్ పైప్ లైన్ లీకేజీ: మరమ్మత్తులు చేపట్టిన అధికారులు

By narsimha lodeFirst Published Sep 27, 2022, 11:11 AM IST
Highlights

అంబేద్కర్ కోనసీమజిల్లాలోని పాశర్లపూడి వద్ద మంగళవారం నాడు  ఓఎన్‌జీసీ పైప్ లైన్ లీకేజీ అయింది. ఈ విషయాన్ని స్థానికులు ఓఎన్ జీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఓఎన్ జీ సీ అధికారులు లీకైన పైప్ లైన్ వద్ద మరమ్మత్తులు చేపట్టారు. 

అమలాపురం: అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పాశర్లపూడి వద్ద మంగళవారం నాడు  ఓఎన్ జీసీ గ్యాస్ పైప్ లీకైంది. ఈ పైప్ లైన్ నుండి గ్యాస్ లీకౌతుంది. దీంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ పైప్ లైన్ లీకైన విషయమై  స్థానికులు ఓన్‌జీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు. గ్యాస్ లీకైన చోట ఓఎన్‌జీసీ అధికారులు  మరమ్మత్తులు చేస్తున్నారు.

గతంలో కూడ ఓఎన్‌జీసీ గ్యాస్ పైప్ లైన్ లీకేజీ ఘటనలు చోటు చేసుకున్నాయి. కొన్ని సమయాల్లో పెద్ద ఎత్తున ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అమలాపురం సమీపంలోని ఓఎన్ జీసీ గ్యాస్ పైప్ లైన్ లీకేజీ కావడంతో 15 మంది సజీవ దహనమయ్యారు. మరో 15 మంది గాయపడ్డారు.ఈ ఘటన 2014 జూన్ 28న చోటుచేసుకుంది.  అమలాపురానికి సమీపంలోని నాగారం పైప్ లైన్ లీక్ కావడంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.ఈ ప్రమాదం కారణంగా స్థానికంగా ఉన్న ఇళ్లు కూడా దగ్ధమయ్యాయి. గ్యాస్ లీకేజీ కారణంగా వ్యాపించిన మంటలను 10 ఫైరింజన్లు ఆర్పివేశాయి. 

ప్రమాదం జరిగిన ప్రాంతంలో కొద్ది కొద్దిగా గ్యాస్ లీకౌతుందని తాము ఫిర్యాదుచేసినా అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపించారు.  గోదావరి ఫెర్టిలైజర్, నాగార్జున ఫెర్టిలైజర్ కంపెనీలకు ఓఎన్ జీసీ నుండి గ్యాస్ సరఫరా చేస్తున్నారు. 
2010 నవంబర్ 10వ తేదీన తాటిపాక వద్ద గ్యాస్ పైప్ లైన్  పేలిపోయింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి నష్టం వాటిల్లలేదు. 1996లో అమలాపురం పట్టణానికి సమీపంలోని పాశర్లపూడి వద్ద  గ్యాస్ పైప్ లైన్ లీకైన ప్రాంతంలో బావిని మూసివేశారు. ఈ బావిలో మూడు మాసాల పాటు అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. 

also read:నర్సాపురంలో గ్యాస్ పైప్‌లైన్ లీకేజీ: భయాందోళనలో స్థానికులు

2012లో తాటిపాక వద్ద రెండు సార్లు గ్యాస్ పైప్ లైన్ లీకేజీ చోటు చేసుకుంది.  2005లో తూర్పుగోదావరి జిల్లా తాండవపల్లి వద్ద ఓఎన్‌జీసీకి చెందిన బావిలో పేలుడు జరిగింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం చోటు చేసుకోలేదు. దీంతో అంతా ఊపరి పీల్చుకున్నారు. బావి తవ్వకం కోసం ఉపయోగించే రిగ్ ధ్వంసమైంది.1995,96 లో పాశర్లపూడి వద్ద అతిపెద్ద ఓఎన్ జీసీ బావిలో 60 రోజుల మంటలు మంటలు చెలరేగాయి. అతి కష్టం మీద ఈ బావిని పూడ్చివేశారు అధికారులు.

click me!