
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం పారిశ్రామికవాడ (ఎస్‌ఈజెడ్) లో మరోసారి విషవాయువు లీక్ అయింది. బ్రాండిక్స్ సెజ్ నుంచి ఘాటు వాసన రావడంతో సెక్యూరిటీ సిబ్బంది పరుగులు తీశారు. 20 నిమిషాల పాటు విషవాయువు వెలువడినట్టుగా చెబుతున్నారు. అయితే ఫ్యాక్టరీ మూసివేసి ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించి బ్రాండిక్స్ కంపెనీ ప్రతినిధులు కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు చేశారు. దీంతో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఘటన స్థలానికి వెళ్తున్నారు. అయితే వరుసగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. అక్కడున్నవారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఇక, బ్రాండిక్స్ అపరెల్ పార్కు సిటీలో శుక్రవారం విషవాయువు లీకైన సంగతి తెలిసిందే. సీడ్స్ ఇంటిమేట్ ఇండియా లిమిటెడ్ దుస్తుల తయారీ యూనిట్‌లో ఒక్కసారిగా గ్యాస్ లీక్ కావడంతో కళ్ల మంటలు, శ్వాస తీసుకోలేకపోవడం, వాంతులతో అక్కడ పనిచేసే మహిళా ఉద్యోగులు విలవిల్లాడారు. అందరూ బయటకు పరుగులు తీశారు. సుమారు 270 మంది మహిళ కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స అందజేశారు.
గ్యాస్ లీక్ మూలాన్ని కనుగొనడానికి ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీ శనివారం దర్యాప్తు ప్రారంభించింది. ఈ కమిటీకి అనకాపల్లి జాయింట్ కలెక్టర్ కల్పన కుమారి, జిల్లా ఫ్యాక్టరీల చీఫ్ ఇన్‌స్పెక్టర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ జిల్లా ఇన్‌ఛార్జ్, అనకాపల్లి అదనపు ఎస్పీ నేతృత్వం వహిస్తారు. ‘‘"గ్యాస్ లీక్, దాని మూలాన్ని గుర్తించడం చాలా సవాలుతో కూడుకున్న పని" అని జిల్లా కలెక్టర్ రవి అన్నారు.
ఇక, అస్వస్థకు గురైనవారిలో ఎక్కువ మంది కోలుకున్నారని అధికారుల తెలిపారు. విశాఖపట్నం నుంచి వచ్చిన నిపుణుల బృందం క్లియరెన్స్ ఇవ్వడంతో.. 110 మంది మహిళలను అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేసినట్లు చెప్పారు. విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో ఇద్దరు గర్భిణులు చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు.