చంపేందుకు షూటర్ నియామకం:బెదిరింపు ఫోన్లపై ఏలూరు పోలీసులకు చింతమనేని ఫిర్యాదు

By narsimha lode  |  First Published Jun 5, 2022, 11:18 AM IST

మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు బెదిరింపు పోన్ కాల్స్ వచ్చాయి. తనను చంపేందుకు షూటర్స్ ను నియమించాలని ఓ ఆగంతకుడు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడినట్టుగా పోలీసులకు ఇచ్చిన  పిర్యాదులో ఆయన పేర్కొన్నారు.


ఏలూరు: TDP కి చెందిన మాజీ ఎమ్మెల్యే Chintamaneni Prabhakar కి బెదిరింపు పోన్ కాల్స్ వచ్చాయి. నిన్ను చంపేందుకు మా బాస్  షూటర్ ను నియమించాడని ఓ ఆగంతకుడు తనకు ఫోన్ చేశాడని చింమనేని ప్రభాకర్  పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  శనివారం నాడు రాత్రి ఈ ఫోన్ వచ్చిందని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ Eluru  త్రీటౌన్ పోలీసులకు ఇచ్చిన పిర్యాదులో పేర్కొన్నారు.

గన్ మెన్ల జీతాలకు వ్యక్తిగతంగా డబ్బు చెల్లించే ఆర్థిక స్థోమత తనకు లేదన్నారు. తనకు పోలీసులే ఉచితంగా సెక్యూరిటీ కల్పించాలని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కోరారు. గత ఎన్నికల్లో  వైసీపీ అభ్యర్ధి అబ్బయ్య చౌదరి చేతుల్లో ఓడిన చింతమనేని ప్రభాకర్ ఇబ్బందులు పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తన,పై అక్రమంగా కేసులు బనాయిస్తుందని ఆయన ఆరోపించారు. గత ఏడాది ఆగష్టులో పోలీసులు చింతమనేనిని అరెస్ట్ చేశారు. 

Latest Videos

పెట్రోల్‌ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ దెందులూరులో చింతమనేని ఆందోళన చేపట్టారు. ఎమ్మార్వో ఆఫీసుకు వెళ్తుండగా ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించారని చింతమనేనిపై కేసు నమోదు చేశారు. అనంతరం నర్సీపట్నంలో ఓ వివాహ వేడుకకు హాజరైన చింతమనేనిని అరెస్ట్ చేసిన పోలీసులు ఏలూరు తరలించారు. అంతకు ముందు కూడా ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.

తనను ఎన్‌కౌంటర్‌ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని చింతమనేని ప్రభాకర్ ఇటీవలనే ఏపీ ప్రభుత్వం పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తనను ఎన్ కౌంటర్ చేసేందుకు ఇప్పటికే రెండు దఫాలు ప్రయత్నించి విఫలమైనట్టుగా ఆయన చెప్పార.. టీడీపీ నాయకులు స్పందించకుంటే ఎప్పుడో చనిపోయేవాడినని చెప్పారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ప్రశ్నించినందుకు తనపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తన లాయర్‌కు సజ్జల వార్నింగ్‌ ఇచ్చారని కూడా చింతమనేని ప్రభాకర్ ఆరోపణలు చేశారు. ఈ విషయమై  తనకు ప్రాణహాని ఉందని ఏలూరు కోర్టును ఆయన ఆశ్రయించారు. 

సీఎం జగన్‌,  సజ్జల రామకృష్ణారెడ్డి , మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, నవ్‌జ్యోత్‌సింగ్‌ గ్రేవల్‌తో పాటు స్థానిక పోలీసులు, అధికారులు, సహకరించిన 21 మందిని శిక్షించాలంటూ ఏలూరు మొబైల్‌ కోర్టులో చింతమనేని ప్రభాకర్‌ ప్రైవేట్‌ కేసు దాఖలు చేశారు. 

చంద్రబాబునాయుడు ఏపీ సీఎంగా ఉన్న సమయంలో మంత్రివర్గ విస్తరణలో తనకు మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో చింతమనేని ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. స్వంతంగా పార్టీని కూడా ఏర్పాటు చేస్తానని కూడా ప్రకటించారు.ఆ తర్వాత చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో ఆయన వెనక్కి తగ్గారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కూడా చింతమనేని ప్రభాకర్ పై పలు కేసులు నమోదయ్యాయి.

also read:సీఎం జగన్, సజ్జల కేసులు పెట్టించి వేధిస్తున్నారు..: కోర్టును ఆశ్రయించిన చింతమనేని ప్రభాకర్

అప్పటి మంత్రి వట్టి వసంత్ కుమార్ తో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గొడవ అప్పట్లో కలకలం రేపిన విషయం తెలిసిందే. 2013 నవంబర్ 26న జరిగిన రచ్చబండ కార్యక్రమంలో  రామచంద్రరావు అనే వ్యక్తిని స్టేజీపైకి పిలవడంతో మంత్రి వట్టి వసంతకుమార్, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మద్య మాటల యుద్ధం ప్రారంభమైంది. మాటా మాటా పెరిగి ఇద్దరు పరస్పరం దాడులు చేసుకొనే స్థాయికి చేరుకుంది.

click me!