
పై ఫొటోలోని వ్యక్తి గురించి ప్రత్కేకంగా పరిచయటం అక్కర్లేదు కదా? దేశానికి ఇంకాగట్టిగా చెప్పాలంటే ప్రపంచానికే యోగాను పరిచయం చేసినట్లు చెప్పుకుంటుంటారు యోగాగురువు రాందేవ్ బాబా. ఒక విషయంలో రాందేవ్ ను మెచ్చుకోవాల్సిందే. యోగాకు కమర్షియల్ ఎలిమెంట్లు అద్దటంలో మాత్రం రాందేవ్ ఆరితేరిపోయారు.
ప్రపంచానికే యోగా పాఠాలు చెబుతున్న రాందెవ్ తన సొంతగ్రామంలోని జనాలను వదులుతారా? అదే విషయాన్ని ప్రపంచానికి చూపాలని మీడియా బాబా స్వగ్రామానికి వెళ్లింది. బాబా స్వస్ధలం హరియాణాలోని మహేంద్రగఢ్ జిల్లాలోని సైదిలిపురం గ్రామం. రాందేవ్ గ్రామస్తులను ఒంగోబెట్టి, కూర్చోబెట్టి, పడుకోబెట్టి ఎన్నిరకాలుగా యోగా చేయిస్తున్నారో అని మీడియా అనుకున్నది. తీరా గ్రామానికి వెళ్ళిన మీడియా ఆశ్యర్యపోయింది. గ్రామంలో ఎక్కడ చూసినా యోగా చేస్తున్న జనాలే కనబడుతారనుకుంటే అసలు ఎవ్వరూ యోగాను పట్టించుకోవటమే లేదు.
అసలు ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం అని కూడా గ్రామస్థులకు తెలీదు. రాందేవ్ ను గ్రామంలో అసలు ఎవ్వరూ పట్టించుకోరట. కారణాలేంటని ఆరాతీస్తే గ్రామాన్ని రాందేవ్ ఏనాడు పట్టించుకోలేదని తెలిసింది. అందుకనే గ్రామస్తులు కూడా బాబాను పట్టించుకోరు.
ఇదే విషయమై గ్రామస్తులు మాట్లాడుతూ 'ఇక్కడ ఎవ్వరూ యోగా చేయరు’. ‘చేసినా ఓ పదిమంది తమ ఇళ్లల్లోనే కూర్చుని చేస్తారు’ అని చెప్పారు. ‘గ్రామంలోని రాజకీయాల వల్ల రాందేవ్ బాబా తలపెట్టిన కార్యక్రమాలేవీ ఈ గ్రామస్థులు పాటించరు' అని రాందేవ్ చిన్ననాటి మిత్రుడు, సైదలిపూర్ గ్రామ సర్పంచ్ దేశ్పాల్ నంబర్దార్ తెలిపారు.
‘రాందేవ్ బాబా ఎప్పుడూ స్వగ్రామానికి వచ్చింది లేదని అందుకే అతనిపట్ల గౌరవం లేద’ని ఓ మహిళ తెలిపింది. అంతేకాకుండా ‘చాలా మంది నిరుద్యోగులు సాయం కోసం రాందేవ్ బాబాని కలిస్తే ఆయన పట్టించుకోలేద’ని కూడా మహిళ పేర్కొనటం విశేషం.