పోలవరంపై చంద్రబాబును నిలదీసిన గడ్కరీ

First Published Jul 11, 2018, 8:46 PM IST
Highlights

పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం పెరగడంపై, ఇతర అంశాలపై కేంద్ర జల వనరుల మంత్రి నితిన్ గడ్కరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని నిలదీశారు. 

పోలవరం: పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం పెరగడంపై, ఇతర అంశాలపై కేంద్ర జల వనరుల మంత్రి నితిన్ గడ్కరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని నిలదీశారు. బుధవారంనాడు చంద్రబాబుతో కలిసి ఆయన పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. 

ఈ సమయంలో ఆయన పలు అంశాలపై చంద్రబాబును వివరణ అడిగారు. చంద్రబాబు ఇచ్చిన వివరణతో ఆయన సంతృప్తి చెందలేదని తర్వాత జరిగిన బిజెపి సభలో మాట్లాడిన తీరును బట్టి అర్థమవుతోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని అంటూనే చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు .

ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా పెరగడంపై ఆయన పదే పదే ప్రశ్నించారు. భూసేకరణలో భూమి ఎందుకు పెరిగిందని ఆయన అడిగారు. పునరావాసంపై, భూసేకరణ నష్టపరిహారంపై ఆయన అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తం చేశారు. 

చంద్రబాబు మీడియాతో మాట్లాడుతుండగానే ఆయన వెళ్లిపోయారు. ఆ తర్వాత బిజెపి ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. పోలవరం ద్వారా నీటిని అందిస్తామని, గిరిజనులకు న్యాయం చేస్తామని ఆయన అన్నారు. ఎపికి న్యాయం చేస్తామని కూడా చెప్పారు. ఎపిని అన్ని రాష్ట్రాలతో సమానంగా చూస్తామని చెప్పారు. ఈ సభలో పోలవరంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పెరిగిన ప్యాకేజీపై, డీపీఆర్ 2పై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. 

అంతకు ముందు పోలవరం ప్రాజెక్టు వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రాజెక్టును సమీక్షించేందుకు బుధవారం పోలవరం ప్రాజెక్టుకు చేరుకున్న సమయంలో ఆ పరిస్థితి చోటు చేసుకుంది.  అక్కడికి భారీగా చేరుకున్న ఉభయ గోదావరి జిల్లాల బీజేపీ శ్రేణులు మంత్రి హెలిప్యాడ్‌ వద్దకు వెళ్లేందుకు యత్నించాయి. అయితే, ఇందుకు పోలీసులు నిరాకరించారు. పాసులు, ప్రాటోకాల్‌ పరిధిలో ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు

తమను లోపలికి పంపాలని బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ప్రాజెక్టు పరిశీలన అనంతరం జరిగే ప్రత్యేక సమావేశంలో గడ్కరీని కలవాలని పోలీసులు బిజెపి కార్యకర్తలకు సూచించారు. 

click me!