రాజకీయాలతో ముడిపెట్టొద్దు: పోలవరంపై గడ్కరీ

First Published Jul 11, 2018, 6:49 PM IST
Highlights

పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని రాజకీయాలతో ముడిపెట్టవద్దని నితిన్ గడ్కరీ సూచించారు. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడితో కలిసి ఆయన బుధవారం సాయంత్రం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు.

పోలవరం: పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని రాజకీయాలతో ముడిపెట్టవద్దని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో కలిసి ఆయన బుధవారం సాయంత్రం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. అభివృద్ధి వేరు, రాజకీయాలు వేరు అని ఆయన అన్నారు. 

పోలవరం నిర్మాణంలో రాజకీయాలకు తావు లేదని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు, దేశానికి కూడా ముఖ్యమైందని అన్నారు. భూసేకరణకు నిధులు, నష్టపరిహారం కావాలంటే ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. 

పోలవరం ప్రాజెక్టుకు నిధుల సమస్య లేదని స్పష్టం చేశారు. సిఎం కోరినట్లు పెండింగు నిధులను విడుదల చేయడానికి ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు. ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. నిధుల విడుదల అనేది కేవలం సాంకేతికమైందేనని అన్నారు. పోలవరం పూర్తయితే రైతుల జీవితాలు మారిపోతాయని అన్నారు. త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు సూచించినట్లు తెలిపారు. 

మూడు రోజుల పాటు అధికారులు ఇక్కడే మకాం వేసి సమస్యలను పరిష్కరించాలని సూచించినట్లు తెలిపారు. పెరిగిన అంచనాలను ఆర్థిక శాఖకు పంపిస్తామని చెప్పారు. ఎప్పటికప్పుడు పోలవరం నిర్మాణం పనులను ర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.

భూసేకరణకు రూ. 33 వేల కోట్ల రూపాయలు కావాలని చంద్రబాబు అన్నారు. 2013 చట్టం ప్రకారం భూసేకరణ వ్యయం పెరిగిందని చెప్పారు. ఫిబ్రవరి నాటికి కాంక్రీట్ పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. పోలవరం నిర్మాణానికి 2019 డిసెంబర్ ను గడువుగా పెట్టుకున్నట్లు తెలిపారు.

click me!