
పెనుగొండ : పెళ్లయి వారంరోజులు కూడా కాలేదు నదిలో దూకి నవ దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దంపతులిద్దరు నదిలోకి దూకగా ప్రాణభయంతో భర్త ఈదుకుంటూ బయటకు వచ్చాడు. కానీ భార్య మాత్రం నీటమునిగి గల్లంతయ్యింది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే ... ఉండ్రాజవరం మండలం మోర్త గ్రామానికి చెందిన శివరామకృష్ణకు వడలికి చెందిన సత్యవాణితో ఐదురోజుల క్రితేమే (డిసెంబర్ 15న) పెళ్లయ్యింది. ఇరు కుటుంబాలు, బంధుమిత్రుల సమక్షంగా చాలా ఘనంగా వీరి వివాహం జరిగింది. గత మంగళవారం భర్తతో కలిసి పుట్టింటికి వచ్చింది సత్యవాణి. ఇలా పెళ్లి వేడుకతో సంతోషంగా వున్నఇంట్లో ఒక్కసారిగా విషాదం నిండిపోయింది.
నవ దంపతులు రామకృష్ణ, సత్యవాణి సినిమాకు వెళతామని చెప్పి వడలి నుండి బైక్ పై వెళ్లారు. ఇలా గత మంగళవారం మద్యాహ్నం బయటకు వెళ్ళినవారు రాత్రయినా ఇంటికి తిరిగి చేరుకోలేదు. ఇటు పుట్టిళ్లు... అటు అత్తవారిళ్ళు ఎక్కడికీ వాళ్లు వెళ్లలేదు. దీంతో కంగారుపడిపోయిన కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు.
Also Read జైలు బయట తల్లికోసం ఈ చిన్నారి ఎలా వెక్కి వెక్కి ఏడుస్తుందో చూడండి...
అయితే నిన్న(బుధవారం) దంపతులు ప్రయాణించిన బైక్ సిద్దాంతం వంతెన వద్ద గుర్తించారు. దీంతో దంపతులిద్దరు నదిలో దూకి ఆత్మహత్య చేసుకుని వుంటారని పోలీసులు భావించారు. కానీ ఇంతలోనే షాకింగ్ విషయం బయటపడింది. రామకృష్ణ బ్రతికే వున్నాడని... తణుకులోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు గుర్తించారు. అతడిని విచారించగా అసలేం జరిగిందో బయటపెట్టాడు.
భార్య సత్యవాణి(19) తో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు... దీంతో ఇద్దరం కలిసి గోదావరి నదిలో దూకినట్లు రామకృష్ణ తెలిపారు. కానీ నీటిలో దూకినతర్వాత తాను ప్రాణభయంతో ఈదుకుంటటూ ఒడ్డుకు చేరుకున్నట్లే తెలిపాడు. కానీ భార్య సత్యవాణి మాత్రం నీటమునిగి గల్లంతయిపోయిందని తెలిపాడు.దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి సత్యవాణి కోసం గోదావరిలో గాలింపు చేపట్టారు.
పెళ్లయిన ఐదురోజులకే ఆత్మహత్య చేసుకోవాలని అనుకోవడం ఏమిటి? నదిలో దూకిన నవదంపతుల్లో భార్య చనిపోయి భర్త బ్రతకడం ఏమిటి? ఇదేదో అనుమానంగా వుందని సత్యవాణి కుటుంబసభ్యలు అంటున్నారు. రామకృష్ణ ఏదో చేసివుంటాడని ... ఇదిబయటపడకుండా నాటకాలు ఆడుతున్నట్లు అనుమానిస్తున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించి ఏం జరిగిందో తెలుసుకోవాలని కోరుతున్నారు.