
Nara Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగిసింది. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలిపల్లిలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో నారా లోకేష్ మాట్లాడుతూ..పాదయాత్ర అన్ని వర్గాల ప్రజల మధ్య విజయవంతంగా కొనసాగిందని అన్నారు. మూడు నెలల్లో ప్రజాస్వామ్యం సత్తా ఏంటో ప్రజలు జగన్‌కి చూపిస్తారని నారా లోకేశ్ పిలుపునిచ్చారు. యువగళం ముగింపు సభ కాదు, ఆరంభ సభ అని పేర్కొన్నారు.
తాడేపల్లి తలుపు బద్దలు కొట్టేవరకు ఈ ప్రజాస్వామ్య యుద్ధం ఆగదని లోకేశ్ స్పష్టం చేశారు. ఇప్పుడు రాష్ట్రానికి విజనరీ నాయకుడు చంద్రబాబు, పవర్‌పుల్ నాయకుడు పవన్ కల్యాణ్ కావాలన్నారు. పాదయాత్ర చేస్తే పోరాటం అవుతుందని, త్వరలో రాష్ట్రంలో రాక్షస పాలన అంతమవుతుందని అన్నారు. యువగళం, మనగళం, ప్రజాగళం అన్న లోకేశ్, బాంబులకే భయపడమని పిల్ల సైకోలకు భయపడతామా అంటూ వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.