ఏలూరులో అమానుషం... నవజాత శిశువును ముళ్ళపొదల్లో పడేసి పరారైన కసాయిలు

By Arun Kumar PFirst Published Sep 25, 2022, 12:03 PM IST
Highlights

అప్పుడే పుట్టిన శిశువు ముళ్లపోదల్లో పడేసి పరారయ్యారు గుర్తుతెలియని దుండగులు. ఈ అమానవీయ ఘటన ఏలూరు జిల్లా నూజివీడు సమీపంలో చోటుచేసుకుంది. 

ఏలూరు : ఆ తల్లికి ఏ కష్టం వచ్చిందో తెలీదుగానీ నవమాసాలు కడుపున మోసిన కన్న బిడ్డను పురిట్లోనే వదిలివెళ్లింది. ఆ పురిటినొప్పుల బాధ ఇంకా తగ్గకముందే పేగుతెంచుకు పుట్టిన బిడ్డను అత్యంత కర్కశంగా ముళ్ళపొదల్లో పడేసింది. కన్నతల్లి ఆ బిడ్డ ప్రాణాలను లెక్కచేయకుండా అమానవీయంగా వ్యవహరించినా వీధికుక్కలు ఆ బిడ్డను కాపాడాయి. ఈ  ఘటన ఏలూరు జిల్లాలో వెలుగుచూసింది. 

ఈ అమానవీయ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నూజవీడు సమీపంలోని ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామంలోని కొండగట్టు కాలనీలో అప్పుడేపుట్టిన శిశువును గుర్తుతెలియని వ్యక్తులు ముళ్లపొదల్లో పడేసారు. బాలున్ని చూసిన వీధికుక్కలు పెద్దగా అరవడంతో ఓ మహిళ వెళ్లిచూడగా మగ శిశువు ఏడుస్తూ కనిపించింది. ఆ చుట్టుపక్కల చూడగా ఎవరూ లేకపోవడంతో బాబును చేతుల్లోకి తీసుకుంది సదరు మహిళ. పసిగుడ్డుకు స్వల్ప గాయాలు కావడంతో దగ్గర్లోని ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లింది మహిళ. అక్కడి డాక్టర్ల సూచన మేరకు శిశువును ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించింది.

Read More  ఏలూరు వేగివాడలో తల్లీ కూతుళ్ల ఆత్మహత్య: పోలీసులపై బంధువుల ఆరోపణలు

ముళ్లపొదల్లో శిశువు దొరికినట్లు గ్రామస్తుల నుండి సమాచారం అందుకున్న పోలీసులు హాస్పిటల్ కు వెళ్లి వివరాలు సేకరించారు. చిన్నారిని మరింత మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శిశువు బాధ్యతను చైల్డ్ కేర్ యూనిట్ వారికి అప్పగించారు. 

అనంతరం అప్పుడే పుట్టిన శిశువును ఇలా ఎవరు పడేశారన్నది తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో మూడు బృందాలుగా ఏర్పడి శిశువును పడేసిన వారికోసం గాలింపు చేపట్టారు. 

click me!