
విశాఖపట్నంలోని ప్రఖ్యాత ఆంధ్రా యూనివర్సిటీలో లైంగిక వేధింపుల కలకలం రేపింది. వర్సిటీలో హిందీ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎన్ సత్యనారాయణపై రీసెర్చ్ స్కాలర్ సోనాలి ఘటక్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. అంతేకాదు.. ఆయనపై జాతీయ మహిళా కమీషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ప్రీ టాక్ వైవా కోసం సత్యనారాయణ రెండు లక్షలు డిమాండ్ చేశారని.. తాను రూ.75 వేలు ఇచ్చానని, ఆపై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డారని మహిళా కమీషన్‌కు ఇచ్చిన ఫిర్యాదులో సోనాలి ప్రస్తావించారు. మిగిలిన డబ్బు ఇవ్వలేదంటూ తన భర్తపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి బ్లాక్ మెయిలింగ్‌కు దిగాడని ఆమె ఆరోపించారు. సత్యనారాయణ లైంగిక వేధింపులకు సంబంధించి యూనివర్సిటీ రిజిస్ట్రార్, వీసీకి ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదని సోనాలి ఆరోపించారు.
మరోవైపు.. తనపై వస్తున్న ఆరోపణలపై ప్రొఫెసర్ సత్యనారాయణ స్పందించారు. అసలు సోనాలి ఎవరో తనకు తెలియదని, ఎప్పుడూ తమ డిపార్ట్‌మెంట్‌లో అడుగుపెట్టలేదని పేర్కొన్నారు. సోనాలి ఎగ్జిక్యూటివ్ కోటాలో వర్సిటీలో జాయిన్ అయ్యిందని.. ఇంకా ఎన్రోల్ కాలేపదని సత్యనారాయణ చెప్పారు. ఈ వ్యవహారంలో తన తప్పుంటే.. సస్పెండ్ చేయాలని ఇప్పటికే వీసీకి చెప్పానని ఆయన పేర్కొన్నారు.