శభాష్ భారతీ.. కూలీకెడుతూనే కెమిస్ట్రీలో పీహెచ్ డీ...

Published : Jul 18, 2023, 01:50 PM IST
శభాష్ భారతీ.. కూలీకెడుతూనే కెమిస్ట్రీలో పీహెచ్ డీ...

సారాంశం

చదువుకోవాలన్న కోరికకు ఏదీ అడ్డురాదని నిరూపించిందో భారతి. పూట గడవడమే కష్టమైనా.. కూలీకి వెడితే కానీ ఇల్లు నడవలేని స్థితి అయినా.. కాలేజీకి వెళ్లాలంటే 28కి.మీ.లు దూరమున్నా వెరవలేదు. పట్టుదలతో చదివింది. పీహెచ్ డీ పట్టా పొందింది. ఎంతోమంది నేటి యువతకు ఆదర్శంగా నిలిచింది.

అనంతపురం జిల్లా : ఆకలి కష్టపడటాన్ని అలవాటు చేస్తుంది. ఆలోచన బతకడాన్ని నేర్పిస్తుంది. లక్ష్యం జీవితాన్ని విజయ పథాన నడిపిస్తుంది. ఇందుకు నిలువెత్తు నిదర్శనం ఆమె...  దినసరి కూలీగా ఎండనకా, వాననకా చెమటోడుస్తూనే.. చదువుపై ఉన్న ఆసక్తితో అహోరాత్రాలూ శ్రమించింది. 

ఉన్నతంగా నిలబడాలన్న తపనతో... రసాయన శాస్త్రంలో పీహెచ్‌డీ సాధించింది. వింటుంటే ఇదేదో సినిమా కథలా అనిపిస్తుందా? కానీ ఇది నిజజీవిత గాధ. సాకే భారతి అనే మహిళ జీవితం.

అనంతపురం జిల్లాలో ఈ అద్భుతం వెలుగు చూసింది. జిల్లాలోని శింగనమల మండలం నాగులగుడ్డం అనే ఓ మారుమూల పల్లెలో భారతి ఉంటోంది. ఓ రోజు ఆ ఊరి చివర ఓ చిన్న రేకుల షెడ్డు ముందు పెద్ద ఎత్తున జనాలు గుమిగూడారు. అందరి ముఖాల్లోనూ ఆశ్చర్యం, మరింత సంతోషం. ఎందుకంటే.. నిత్యం తమతో పాటు కూలి పనులకొచ్చే భారతి డాక్టర్‌ అయ్యింది. 

అది మెడిసిన్ చదివిన డాక్టర్ కాదు.. చదువులతల్లి కరుణిస్తే వచ్చిన డాక్టరేట్. ఆమె కోచింగ్‌లకు వెళ్లలేదు, ఎక్స్ ట్రా క్లాసెస్ లేవు. మిస్ట్రీలాంటి కెమిస్ట్రీని ఒంటిచేత్తే చదివేసింది. దీంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంత సంతోషం దరిచేరినా ఆమెలో చెదరని నిశ్చలత.

ఆ తరువాత ఆమెకు అనంతపురం నగరంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం. పీహెచ్‌డీ పట్టా బహూకరించారు. అక్కడికి వేదిక మీదకు భర్త, కూతురు కలిసి వచ్చింది భారతి. పారగాన్‌ చెప్పులూ, ఓ సాదా చీర కట్టుకొచ్చిన ఆమె ఆహార్యాన్ని చూసి వేదికమీది పెద్దలూ, అతిథుల ముఖాల్లో ఒకటే ఆశ్చర్యం. 

పేదరికం లక్ష్యసాధనకు అడ్డంకి కాదని రుజువు చేస్తూ నడిచొస్తున్న ఆ చదువుల సరస్వతిని చూసి అబ్బుర పడ్డారందరూ. ఆ సమయంలో కూడా ఆమె ఇసుమంతైనా గర్వం కనిపించలేదు. 

ఆవనిగడ్డ కాలువలో పడ్డ కారు: తోట్లవల్లూరు వద్ద రెండు మృతదేహలు, ఆచూకీ లేని రత్నభాస్కర్

చదవాలన్న కోరిక చిన్నతనంనుంచే... 
చిన్నప్పటి నుంచీ బాగా చదువుకోవాలనుకునేది భారతి. పదో తరగతి వరకూ శింగనమల ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్‌ పామిడి జూనియర్‌ కాలేజీలో పూర్తిచేసింది. తల్లిదండ్రులకు ముగ్గురాడపిల్లలు. వారిలో ఈమే పెద్దది. వీరందరి బాధ్యతల భారం, కుటుంబ ఆర్థిక స్థితి బాగోలేక మేనమామ శివప్రసాద్‌తో తనకి పెళ్లి చేశారు. 

భవిష్యత్తు గురించి ఎన్ని కలలున్నా...ఆ విషయం భర్తకు చెప్పలేక పోయింది. అతడే ఆమె కోరికను అర్థం చేసుకున్నాడు. పై చదువులు చదివేందుకు ప్రోత్సాహం అందించాడు. భారతి కూడా తమ జీవితాలను బాగు చేసుకోవడానికి ఇదో అవకాశం అనుకుంది. భర్త ఆర్థిక పరిస్థితీ అంతంత మాత్రమే. అందుకే కొన్నిరోజులు కాలేజీకి వెళ్తూ, మరికొన్ని రోజులు కూలీపనులు చేస్తూనే అనంతపురం ఎస్‌ఎస్‌బీఎన్‌లో డిగ్రీ, పీజీ పూర్తి చేసింది. 

అప్పటికే తనకో కూతురు గాయత్రి. ఆ బిడ్డ ఆలనా పాలనా చూసుకుంటూనే చదువూ, పనులూ సమన్వయం చేసుకునేది. రోజూ రాత్రి పొద్దుపోయే వరకూ చదువుకునేది. మళ్లీ కోడి కూయక ముందే లేచి పుస్తకాలతో కుస్తీ పట్టేది. 

కాలేజీకి వెళ్లాలంటే ఊరి నుంచి కనీసం 28 కిలో మీటర్లు ప్రయాణించాలి. రవాణా ఖర్చులు భరించలేని పరిస్థితి. అందుకే, ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని గార్లదిన్నె వరకూ నడిచి వెళ్లి అక్కడ బస్సెక్కేది. ఇన్ని కష్టాల మధ్యా భారతి డిగ్రీ, పీజీ మంచి మార్కులతో పూర్తిచేసింది. అది చూసి భర్త, ప్రొఫెసర్లు పీహెచ్‌డీ దిశగా ఆలోచించమన్నారు. 

ప్రయత్నిస్తే ప్రొఫెసర్‌ డా.ఎంసీఎస్‌ శుభ దగ్గర ‘బైనరీ మిక్చర్స్‌’ అంశంపై పరిశోధనకు అవకాశం లభించింది. ఇందుకోసం వచ్చే ఉపకార వేతనం భారతికి కొంత సాయపడింది. అయినా తను కూలి పనులు మానలేదు. '‘డాక్టరేట్‌ చేస్తే వర్సిటీ స్థాయిలో ఉద్యోగం అందుకోవచ్చు. అది మా జీవితాల్ని బాగు చేస్తుంది. నేను నేర్చుకున్న జ్ఞానాన్ని మరెంతో మంది పంచొచ్చు. నేను సాధిస్తే అది మరెంతో మందికి ప్రేరణ కూడా కల్పిస్తుంది... ఇవన్నీ నన్ను నడిపించాయి..’ అంటోంది చదువుల భారతి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

చంద్రబాబు వేసే బిస్కెట్లకు కక్కుర్తి పడకండి | YS Jagan On AP Police | AP Localbody Elections 2026
మాది టైం వస్తది | YS Jagan Sensational Comments On Chandrababuy | AP Local Body Elections 2026