Andhra Pradesh News: ఆర్ఐ పై దాడి గడ్డం గ్యాంగ్ పనే... క్యాసినో స్టార్ విశ్వరూపమిదే: లోకేష్ ఫైర్

Arun Kumar P   | Asianet News
Published : Apr 22, 2022, 11:11 AM IST
Andhra Pradesh News: ఆర్ఐ పై దాడి గడ్డం గ్యాంగ్ పనే... క్యాసినో స్టార్ విశ్వరూపమిదే: లోకేష్ ఫైర్

సారాంశం

గుడివాడలో అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకోడానికి ప్రయత్నించిన రెవన్యూ ఇన్స్పెక్టర్ పై జరిగిన దాడిపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీరియస్ అయ్యారు. ఇది ముమ్మాటికీ గడ్డం గ్యాంగ్ పనేనని ఆయన ఆరోపించారు. 

గుడివాడ: అక్రమంగా జరుగుతున్న మట్టి తవ్వకాలను అడ్డుకోడానికి వెళ్లిన ఆర్ఐ పై జేసిబితో దాడిచేసిన ఘటన కృష్ణా జిల్లా గుడివాడ మండలం మోటూరులో వెలుగుచూసింది. ఇలా ఆర్ఐ పై  దాడికి పాల్పడింది మాజీ మంత్రి కొడాలి నాని (kodali nani) అనుచరుడైన గంట సురేష్ సోదరుడు కళ్యాణ్‌ గా గుర్తించారు. అధికార పార్టీ, కొడాలి నాని అండతో అతడు ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఆ ధైర్యంతోనే ఆర్ఐపై కూడా దాడికి తెగబడినట్లు తెలుస్తోంది. 

ఆర్ఐ పై దాడి ఘటనపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (nara lokesh) సీరియస్ అయ్యారు. మ‌ట్టిమాఫియాని అడ్డుకున్న రెవెన్యూ ఇన్‌స్పెక్ట‌ర్‌పై జేసీబీతో దాడిచేసిన గ‌డ్డంగ్యాంగ్ ని వెంటనే అరెస్ట్ చేయాలని లోకేష్ డిమాండ్ చేసారు. అలాగే వైసీపీ నేత‌ల దాడుల నుండి ప్ర‌భుత్వ సిబ్బంది, అధికారుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాలని కోరారు. 

''అక్ర‌మాల‌ని అడ్డుకున్న‌వారికి ఎవ్వ‌రికైనా ఇదే గ‌తి ప‌డుతుంద‌ని వైసీపీ నేత‌లు పదేపదే హెచ్చ‌రిస్తూ వున్నారు. అవినీతిని ప్ర‌శ్నిస్తే అంతం చేస్తామ‌ని బెదిరించడమే కాదు ఇప్ప‌టికే చాలామందిని అంత‌మొందించారు వైసీపీ నేత‌లు. పోలీసులు, అధికారుల అండ‌తో ప్ర‌జ‌లు, ప్ర‌తిప‌క్ష‌ నేత‌లు, ప్ర‌జాసంఘాల నేత‌ల్ని టార్చ‌ర్ చేసిన వైసీపీ నేత‌లు... ఇప్పుడు త‌మ‌కు అడ్డువ‌స్తే పోలీసుల్ని, అధికారుల్నీ వ‌ద‌ల‌మ‌ని నిరూపించుకున్నారు'' అని లోకేష్ పేర్కొన్నారు. 

''వైసీపీ గ‌డ్డం గ్యాంగ్ అరాచ‌కాల‌కు ప‌రాకాష్ట‌గా నిలిచింది గుడివాడ‌లో ఘ‌ట‌న‌. గుడివాడ గ‌డ్డం గ్యాంగ్ క‌నుస‌న్న‌ల్లో సాగే మ‌ట్టిమాఫియాని నిలువ‌రించిన రెవెన్యూ ఇన్‌స్పెక్ట‌ర్‌ అర‌వింద్ పై ఏకంగా జేసీబీతో దాడి చేయ‌డం రాష్ట్రంలో వైసీపీ అరాచ‌కాల‌కు ప‌రాకాష్ట‌. రెవెన్యూ సిబ్బంది ప్రాణాల్ని తీసేందుకు య‌త్నించిన గ‌డ్డం గ్యాంగ్ మ‌ట్టిమాఫియా అరాచ‌కాలు పోలీసుల‌కి ప‌ట్ట‌వా? ఈ రోజు రెవెన్యూ అధికారుల‌పైకి వ‌చ్చిన జేసీబీ పోలీసుల‌పైకీ రాద‌న్న గ్యారెంటీ ఉందా?'' అంటూ హెచ్చరించారు. 

''కృష్ణా జిల్లా గుడివాడ మండలం మోటూరులో అర్ధ‌రాత్రి సాగుతున్న మ‌ట్టి త‌వ్వ‌కాల‌ని అడ్డుకున్న అర‌వింద్‌పై దాడి ముమ్మాటికీ గుడివాడ‌ గ‌డ్డం గ్యాంగ్ ప‌నే. మంత్రి ప‌ద‌వి పోయిన‌ క్యాసినో స్టార్ విశ్వ‌రూపం చూపిస్తానంటే ఏంటో అనుకున్నాను. ఇలా త‌న మాఫియా గ్యాంగుల‌ని అడ్డుకునే రెవెన్యూ అధికారుల‌పై దాడులు చేయ‌డ‌మా విశ్వ‌రూపం అంటే..!'' అని ఎద్దేవా చేసారు. 

''ఆర్ఐ అర‌వింద్ వైపు అదృష్టం ఉండి బ‌తికి బ‌ట్ట‌క‌ట్టాడు. లేదంటే చంపేసేవారే. ద‌య‌చేసి ప్ర‌భుత్వ ఉద్యోగులు, పోలీసులు కాస్తా జాగ్ర‌త్త‌గా వుండండి. ప్ర‌జ‌ల్ని ఎలాగూ మీరు ర‌క్షించ‌లేరు. మీ ప్రాణాల్నైనా వైసీపీ రాక్షసుల నుంచి కాపాడుకోండి. ఈ ముఖ్య‌మంత్రి, ప్ర‌భుత్వం కోసం మీరు ప్రాణాలు ప‌ణంగా పెడితే,  ఆ ప్రాణాలు తీసుకుంటాడే కానీ మీకు ర‌క్ష‌ణ‌గా వుండ‌డు. సీఎం ప్రోత్సాహంతోనే మ‌ట్టిమాఫియాలు, గ‌డ్డం గ్యాంగులు బరితెగిస్తున్నాయి. ఆర్ఐపై దాడిచేసిన మ‌ట్టిమాఫియా... దాని వెనకున్న గ‌డ్డం గ్యాంగ్ బాస్‌ని అరెస్టు చేయాల‌ని డిమాండ్ చేస్తున్నాను. విధుల్లో ఉన్న ప్ర‌భుత్వ ఉద్యోగులు, అధికారుల‌కి ర‌క్ష‌ణ క‌ల్పించాలి'' అని లోకేష్ డిమాండ్ చేసారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!