Andhra Pradesh News: సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్ కు ఆరునెలల జైలుశిక్ష... హైకోర్ట్ సంచలన తీర్పు

Arun Kumar P   | stockphoto
Published : Apr 22, 2022, 09:44 AM ISTUpdated : Apr 22, 2022, 09:55 AM IST
Andhra Pradesh News: సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్ కు ఆరునెలల జైలుశిక్ష... హైకోర్ట్ సంచలన తీర్పు

సారాంశం

కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్ కు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం జైలుశిక్ష విధించింది. 

అమరావతి: అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్, రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి లకు ఏపీ హైకోర్టు ఆరునెలల జైలుశిక్ష విధించింది. తమ ఆదేశాలను పాటించకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఈ సంచలన తీర్పునిచ్చింది. 

మంగంపేట ప్రాంతంలో అక్రమ నిర్మాణాలంటూ కొన్ని నిర్మాణాలను అధికారులు కూల్చేసారు. అయితే ఈ కూల్చివేతలపై  ఓబులవారిపల్లెకు చెందిన నరసమ్మ హైకోర్టును ఆశ్రయించింది. ఏయే నిర్మాణాలు కూల్చివేసారో, ఇలా  కూల్చేసిన నిర్మాణాల విలువ తేల్చేందుకు ప్రత్యేకంగా ఇంజనీర్లను నియమించేలా ఆదేశాలివ్వాలని ఆమె దాఖలుచేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. నరసమ్మ తరపు న్యాయవాది వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం  ఇంజనీర్లను నియమించాలని అధికారులను ఆదేశించింది. 

అయితే కోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేయడం లేదంటూ నరసమ్మ మరోసారి హైకోర్టుకు వెళ్లింది. దీంతో కోర్టు ఆదేశాలను రాజంపేట సబ్‌ కలెక్టర్‌ కేతన్‌ గార్గ్, ఏపీఎండీసీ చీఫ్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ ఎం.సుదర్శనరెడ్డి ధిక్కరించినట్లు కోర్టు తేల్చింది. దీంతో ఈ ఇద్దరికి ఆరునెలల జైలుశిక్షతో పాటు రెండువేల రూపాయల జరిమానా విధించింది. ఈ తీర్పును వెంటనే అమలుచేయకుండా అప్పీలుకు వెళ్లేందుకు వారం రోజుల సమయం ఇచ్చింది. ఈ మేరకు హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి తీర్పు ఇచ్చారు. 

గతంలోనూ  ఐఎఎస్ లకు జైలుశిక్ష:

ఇదిలావుంటే ఇటీవల కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఎనిమిది మంది ఐఎఎస్ లకు హైకోర్టు జైలు శిక్ష విధించింది. అయితే న్యాయస్థానానికి ఐఎఎస్ అధికారులు క్షమాపణ కోరడంతో న్యాయస్థానం జైలుశిక్షకు బదులు సేవా కార్యక్రమాలు చేయాలని ఆదేశించింది. ఇకపై తమ ఆదేశాలను ధిక్కరిస్తూ కఠినంగా వ్యవహస్తామని కోర్టు ఐఎఎస్ లకు హెచ్చరించింది. 

పాఠశాలల్లో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయవద్దని  ఆదేశాలను హైకోర్టు గతంలో జారీ చేసింది.  అయితే ఈ ఆదేశాలను IAS లు అమలు చేయలేదు. ఇలా కోర్టు ఆదేశాలను పాటించని ఐఎఎస్ లు విజయ్ కుమార్, గోపాలకృష్ణ ద్వివేది, శ్యామలారావు, రాజశేఖర్, శ్రీలక్ష్మి, గిరిజా శంకర్, చిన వీరభద్రుడు, ఎంఎంనాయక్ లపై హైకోర్టు సీరియస్ అయింది.  కోర్టు ధిక్కరణ కింద ఈ ఎనిమిది మంది ఐఎఎస్‌లకు  రెండు వారాల పాటు జైలు శిక్షను విధించింది.  
 
అయితే కోర్టు ఆగ్రహం నేపథ్యంలో ఐఎఎస్ లు ఆదేశాలను ధిక్కరించినందుకు క్షమాపణలు కోరారు. దీంతో రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో సేవా కార్యక్రమాలు చేయాలని ఐఎఎస్ లను కోర్టు ఆదేశించింది. జైలు శిక్షకు బదలుగా హాస్టల్ విద్యార్ధులకు సేవ చేయాలని సూచించింది. ప్రతి నెల ఏదో ఒక రోజు  సంక్షేమ హాస్టళ్లలో ఐఎఎస్ లు సేవ చేయాలని సూచించింది. అంతేకాదు ఒక రోజు పాటు కోర్టు ఖర్చులను కూడా భరించాలని ఆదేశించింది. 

గతంలో 2021 సెప్టెంబర్ మాసంలో కూడా ఐఎఎస్ అధికారి మన్మోహన్ సింగ్ సహా ఐదుగురు ఐఎఎస్ అధికారులకు కూడా ఏపీ హైకోర్టు శిక్ష విధించింది. నాలుగు వారాల పాటు జైలు శిక్ష విధించింది. అంతేకాదు జరిమానాను విధించింది. గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయని కారణంగా కూడా హైకోర్టు ఈ శిక్ష విధించింది. అయితే ఐఎఎస్ లు క్షమాపణ కోరడంతో ఉన్నత న్యాయస్థానం సంక్షేమ హాస్టళ్లలో సేవా కార్యక్రమాలు చేయాలని ఆదేశించింది. 

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!