
గుంటూరు: పుదుచ్చెరి ఎన్నికల నేపథ్యంలో కేంద్రంలో అధికార పార్టీ బిజెపి ఇచ్చిన ఓ హామీ ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలను వేడెక్కిస్తోంది. ఎన్నికల్లో బిజెపి గెలిస్తే పుదుచ్చెరికి ప్రత్యేక హోదా ఇస్తామన్నహామీయే ఏపీలో వైసిపి, బిజెపిలను ఇరకాటంలో పెట్టింది. ఈ విషయంపైనే స్పందిస్తూ తాజాగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ వైసిపిపై విరుచుకుపడ్డారు.
''మోదీ మెడ వంచి తెస్తానన్న ప్రత్యేకహోదాని తాకట్టు పెట్టిన ఫేక్ సీఎం గారూ! ఇప్పుడు బీజేపీ పుదుచ్చేరికి స్పెషల్ స్టేటస్ ఇస్తామంటోంది. ఏపీకి ముగిసిన అధ్యాయమైన ప్రత్యేకహోదా పుదుచ్చేరిలో ఎలా మొదలవుతుందో?'' అంటూ ట్విట్టర్ వేదికన లోకేష్ ప్రశ్నించారు.
''రాష్ట్రంలో కమలంతో రహస్య ప్రయాణాన్ని కట్టిపెట్టేసి పుదుచ్చేరిలో బీజేపీ మిత్రుల గెలుపు కోసం వైకాపా నాయకులతో విస్తృత ప్రచారం చేయిస్తున్నారు వైఎస్ జగన్.. మీ కేసుల గురించి కాకుండా కాస్తా ప్రత్యేకహోదా కోసం ఇప్పటికైనా గట్టిగా అడగండి'' అని లోకేష్ సూచించారు.