ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులకు విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ తీపికబురు చెప్పారు. పాత ఫీజు రీఎంబర్స్‌మెంట్ విధానాన్ని అమలు చేసేందుకు విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ గుడ్ న్యూస్ చెప్పారు. విద్యా దీవెన, వసతి దీవెన పథకాల స్థానంలో పాత ఫీజు రీఎంబర్స్‌మెంట్ విధానాన్ని అమలు చేసేందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
2019కి ముందు నేరుగా కళాశాలల ఖాతాల్లో ఫీజు రీఎంబర్స్‌మెంట్ నగదు జమ అయ్యేది. ఇందులో విద్యార్థుల ప్రమేయం ఏమాత్రం ఉండదు. కేవలం కళాశాలల్లో దరఖాస్తు చేసుకుంటే సరిపోయేది. అయితే, 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది. వసతి దీవెన, విద్యా దీవెన పేరుతో పథకాలు తీసుకొచ్చి... పాత ఫీజు రీఎంబర్స్‌మెంట్, స్కాలర్షిప్, మెస్ బిల్లులను విద్యార్థులు- తల్లుల ఉమ్మడి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. అలా బ్యాంకు ఖాతాల్లో జమ అయిన మొత్తాన్ని విద్యార్థులు డ్రా చేసి కళాశాలల్లో చెల్లిస్తూ వచ్చారు. అయితే, ఏదైనా సాంకేతిక సమస్య ఎదురై విద్యార్థి బ్యాంకు ఖాతాలో నగదు జమ కాకపోతే.. సొంతంగా ఫీజు రీఎంబర్స్‌మెంట్ చెల్లించాల్సిన పరిస్థితి. తొలుత ఏ సెమిస్టర్ ఫీజు ఆ సెమిస్టర్‌లోనే ఖాతాల్లో జమ చేస్తామన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.. ఆ తర్వాత కొన్నిసార్లు సమయానికి నిధులు జమ చేయలేదు. దీంతో అనేక మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యా దీవెన, వసతి దీవెన నగదు ఖాతాల్లో జమ కావడం ఆలస్యమైతే ఫీజులు విద్యార్థులే చెల్లించాలని కళాశాలల యాజమాన్యాలు ఒత్తిడి చేయడం, హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడం లాంటి ఘటనలు జరిగాయి. ఇలాంటి సందర్భాల్లో పేద విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది.
undefined
ఈ నేపథ్యంలో పాత ఫీజు రీఎంబర్స్‌మెంట్ విధానం పునరుద్ధరణతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పనున్నాయి. విద్యార్థుల ప్రమేయం లేకుండా ప్రభుత్వమే నేరుగా కళాశాలల ఖాతాల్లో ఫీజు రీఎంబర్స్‌మెంట్ జమ చేయనుండటంతో సమస్య తీరనుంది.
అలాగే, ఉన్నత విద్యా శాఖ పరిధిలో నెలకొన్న సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి నారా లోకేశ్... కళాశాలల్లో మాదక ద్రవ్యాలు (డ్రగ్స్)ను నిరోధించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేకంగా నోడల్ ఆఫీసర్ల నియామకం అంశాన్ని పరిశీలించాలని, డ్రగ్స్‌పై విద్యార్థులను చైతన్యం చేసేందుకు స్వచ్చంద సంస్థల సహకారాన్ని తీసుకోవాలని సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 3,220 లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించినట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్, కళాశాల విద్య కమిషనర్ పోలా భాస్కర్, ఉన్నత విద్యాశాఖ ఇంఛార్జి చైర్మన్ రామ్మోహన్ రావు, టెక్నికల్ ఎడ్యుకేషన్ డైరక్టర్ బి.నవ్య పాల్గొన్నారు.