చంద్రబాబుపై లోకేష్ లీడ్: ఇద్దరు అభ్యర్ధులను ప్రకటించిన చినబాబు

First Published Jul 9, 2018, 4:47 PM IST
Highlights

2019 ఎన్నికల్లో కర్నూల్ ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు బుట్టా రేణుక, ఎస్వీ మోహన్ రెడ్డి పేర్లను ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. సోమవారం నాడు కర్నూల్ జిల్లాలో జరిగిన ఒ కార్యక్రమంలో ఆయన ఈ పేర్లు ప్రకటించారు.దీంతో టీజీ వెంకటేష్ వర్గీయులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు.


కర్నూల్:  కర్నూల్ జిల్లాలో ఇద్దరు అభ్యర్ధులను ఏపీ మంత్రి నారా లోకేష్ సోమవారం నాడు ప్రకటించారు. కర్నూల్ జిల్లా పర్యటన సందర్భంగా లోకేష్ 2019 ఎన్నికల్లో కర్నూల్ ఎంపీ , ఎమ్మెల్యే స్థానానికి చేసే పోటీ చేసే అభ్యర్ధులను లోకేష్ ప్రకటించారు.

2019 ఎన్నికల్లో కర్నూల్ ఎంపీ స్థానం  నుండి బుట్టా రేణుక, అసెంబ్లీ స్థానం నుండి ఎస్వీ మోహన్ రెడ్డి పోటీ చేస్తారని లోకేష్ ప్రకటించారు. అయితే ఈ ప్రకటన టీడీపీలో వర్గ విబేధాలను పెంచిపోషించేదిగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కర్నూల్ జిల్లాలో సోమవారం నాడు జరిగిన కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ వీరిద్దరి పేర్లను ప్రకటించారు. ఈ పేర్లను ప్రకటించిన వెంటనే రాజ్యసభ సభ్యుడు  టీజీ వెంకటేష్ పక్క సీటుకు మారిపోయాడు. ఈ ప్రకటన టీజీ వెంకటేష్ వర్గీయుల్లో ఆగ్రహం తెప్పిస్తోంది.

ఇవాళ లోకేష్ పర్యటనను పురస్కరించుకొని ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, టీజీ వర్గీయులు వేర్వేరుగా ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి భారీ ర్యాలీగా వెళ్లి లోకేష్ కు స్వాగతం పలికారు.  రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ వినూత్నంగా లోకేష్ కు పూలమాల వేశారు.

2014 ఎన్నికలకు ముందు టీజీ వెంకటేష్ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో కర్నూల్ అసెంబ్లీ స్థానం నుండి టీజీ వెంకటేష్ టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగారు. వైసీపీ అభ్యర్ధిగా ఎస్వీ మోహన్ రెడ్డి పోటీ చేశారు. ఎస్వీ మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. నాలుగేళ్లలో చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో  ఎస్వీ మోహన్ రెడ్డి వైసీపీ నుండి టీడీపీలో చేరారు.

ఇదే తరుణంలో గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన  టీజీ వెంకటేష్ కు చంద్రబాబునాయుడు రాజ్యసభ సభ్యత్వం కల్పించారు. దీంతో 2019 ఎన్నికల్లో వెంకటేష్ తన కొడుకు టీజీ భరత్ ను కర్నూల్ అసెంబ్లీ స్థానం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని భావిస్తున్నారు.

ఈ తరుణంలో టీజీ భరత్, ఎస్వీ మోహన్ రెడ్డి వర్గీయులు పోటా పోటీగా కర్నూల్ పట్టణంలో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఒకరిపై మరోకరు పార్టీలో ఆధిపత్యం పెంచుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఎమ్మెల్యే టిక్కెట్టు దక్కించుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఎలా ఉంటుందనే విషయమై గతంలో  పార్టీ పేరుతో నిర్వహించినట్టుగా ప్రచారం సాగింది. ఈ సర్వే విషయమై ఒకరిపై మరోకరు పార్టీ నాయకత్వానికి ఫిర్యాదులు చేసుకొన్నారు. 

ఇదిలా ఉంటే లోకేష్ కర్నూల్ జిల్లా పర్యటనను పురస్కరించుకొని కర్నూల్  వేదికగా నిర్వహించిన సభలో ఎంపీగా బుట్టా రేణుక, ఎమ్మెల్యేగా ఎస్వీ మోహన్ రెడ్డి పేర్లను లోకేష్ ప్రకటించారు. 

కర్నూల్ అసెంబ్లీ  స్థానానికి ఎస్వీ మోహన్ రెడ్డి పేరును ప్రకటించగానే టీజీ వర్గీయులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రకటన చేయగానే  టీజీ వెంకటేష్ అసంతృప్తితో తాను కూర్చొన్న సీటు నుండి మరో సీటులోకి మారిపోయారు.అయితే ఈ విషయమై టీజీ వెంకటేష్ ఇంకా స్పందించలేదు. 

click me!