ఎవరూ భయపడొద్దు, నేను వస్తున్నాను: ఇక బాలకృష్ణ పరామర్శ యాత్ర

By Sumanth Kanukula  |  First Published Sep 12, 2023, 12:16 PM IST

రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేశారని ఆ పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. 


తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎవరూ భయపడొద్దని ఆ పార్టీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. తాను వస్తున్నానని.. అందరికి అండగా ఉంటానని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌‌తో 13 మంది చనిపోయాని.. వారందరి కుటుంబాలను పరామర్శించేందుకు వస్తున్నానని వెల్లడించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టుగా పేర్కొన్నారు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని.. తాను వస్తున్నానని.. అండగా ఉంటానని చెప్పారు. తెలుగువాడి పౌరుషం ఏమిటో చూపిద్దామని అన్నారు. 

చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై బాలకృష్ణ మంగళవారం టీడీపీ కేంద్ర  కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేశారని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఇలాంటివి ఎన్నో చూసిందని.. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఎన్ని కేసులు పెట్టిన భయపడేది లేదని.. తాము న్యాయపోరాటం చేస్తామని చెప్పారు.  ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు లేకుండా.. గంజాయికి బానిసలుగా చేస్తున్నారని విమర్శించారు. 
 

Latest Videos

Also Read: చంద్రబాబు అరెస్టు: బాలక్రిష్ణ చేతుల్లోకి టిడిపి, జూ.ఎన్టీఆర్ దూరమే

ఎన్టీఆర్, చంద్రబాబులు తెలుగువారిలో ఆత్మ  విశ్వాసం నింపితే.. నేడు ప్రపంచ పటంలో ఏపీని లేకుండా చేశారని విమర్శించారు. ఏపీని అందరూ అవహేళన చేసే పరిస్థితి ఉందని అన్నారు. టీడీపీ హయాంలోనే అభివృద్ది, సంస్కరణలు తీసుకురావడం జరిగిందని చెప్పారు. హైదరాబాద్ హైటెక్ సిటీ, జీనోమ్ వ్యాలీ వంటివి చంద్రబాబు హయాంలోనే వచ్చాయని తెలిపారు. కానీ ఈరోజు ఏపీలో పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ప్రజలు గమనించాలని  కోరారు. 

మన హక్కుల కోసం మనం పోరాడాలని పిలుపునిచ్చారు. పిచ్చి కుక్కలు మొరిగితే భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. చేతులు ముడుచుకుని కూర్చొంటే అంతే సంగతులు అని పేర్కొన్నారు. సీఎం జగన్ లక్ష కోట్ల అవినీతి చేశారని, జగన్నాటకుడని, దేశానికి పట్టిన దరిద్ర జాతకుడని, రావణ పాలకుడని  విమర్శించారు. జగన్ మీద ఎన్నో కేసులు ఉన్నాయని.. ఇప్పుడు బెయిల్‌పై తిరుగుతున్నాడని విమర్శించారు. 
 

Also Read: వాళ్లకు మనుషులు అంటేనే ఎలర్జీ.. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు: బాలకృష్ణ

ఒక్క చాన్స్ అడిగితే ప్రజలు తప్పు చేశారని బాలకృష్ణ అన్నారు. ప్రతి కార్యకర్త, ప్రజలు వారి హక్కుల  కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రాష్ట్రంలో ఎన్నో ట్యాక్స్‌లు  వేస్తున్నారని.. రేపు పీల్చే గాలి మీద కూడా ట్యాక్స్ వేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. చంద్రబాబుపై ముందు  ముందు కేసులు పెట్టేందుకు చూస్తున్నారని.. చట్టాలను అతిక్రమించి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మొరిగే కుక్కలు మొరుగుతాయని వాటిని పట్టించుకోనని.. అతిక్రమిస్తే ఎవరిని వదిలిపెట్టనని అన్నారు.   రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు కూడా హక్కులను కాపాడుకునేందుకు నడుం బిగించాలని కోరారు. చంద్రబాబుకు మద్దతు తెలిపిన ప్రతిపక్ష పార్టీల నాయకులు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టుగా పేర్కొన్నారు. 

click me!