విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ మీద పోలీసులు దాడి చేయడాన్ని టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు తప్పు పట్టారు. సుధాకర్ ను తాళ్లతో కట్టేసి, లాఠీలతో కొట్టారని ఆయన ఆరోపించారు.
విజయవాడ: విశాఖ జిల్లాలో డాక్టర్ సుధాకర్ ను తాళ్లతో కట్టి, లాఠీలతో కొట్టడం వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు నిదర్శనమని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నాయకుడు నక్కా ఆనందబాబు అన్నారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో మాస్కులు అడిగినందుకు సస్పెండ్ చేసి విధుల నుండి తొలగించడమే కాకుండా.. ఒక డాక్టర్ ను అందులోనూ దళితుడిని ఇలా రోడ్డుపై పడేసి కొట్టడం వైసీపీ నియంతృత్వ పోకడలకు అద్దం పడుతోందని అన్నారు.
తనకు జరిగిన అన్యాయంపై అర్ధనగ్న నిరసన తెలిపితే.. ఒక ఉగ్రవాదిని అరెస్టు చేసినట్లు పోలీసులు తాళ్లతో కట్టి, లాఠీలతో కొట్టడం హేయమని ఆయన అన్నారు. పోలీసుల తీరు చూసి సభ్య సమాజం చీదరించుకుంటోందని అన్నారు. దళితుడు, అందులోనూ ఒక డాక్టర్ అనే కనీస స్పృహ కూడా లేకుండా కానిస్టేబుల్ లాఠీతో దాడి చేయడాన్ని బట్టి పోలీసులు ప్రభుత్వానికి ఎంతగా దాసోహమైపోయారో అర్ధమవుతోందని అన్నారు.
దళితుడైనందు వల్లే డాక్టర్ సుధాకర్‌ని సస్పెండ్ చేశారని అన్నారు. కుటుంబసభ్యుల్నీ వేధించారని, తనయుడ్ని స్టేషన్‌కి తీసుకెళ్లి నానా ఇబ్బందులు పాలు చేశారని అన్నారు. అసలు చేతులు విరిచి వెనక్కి కట్టి కొట్టాల్సిన అవసరం ఏమిటని విశాఖ ప్రజానీకం ప్రశ్నిస్తుంటే జగన్మోహన్ రెడ్డికి చెందిన మీడియాలో మాత్రం డాక్టర్ పై విషం చిమ్ముతూ తప్పతాగి వీరంగం చేస్తున్నారంటూ రాసి పత్రికా విలువలను కూడా నాశనం చేస్తున్నారని అన్నారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదా.? ప్రశ్నిస్తే హింసిస్తారా.? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా.. రాచరికంలో ఉన్నామా అని ఆయన ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య హననం ఎంత దారుణంగా జరుగుతోందో ఈ ఘటనే ప్రత్యక్ష నిదర్శనమని అన్నారు ఘటనపై సత్వర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.