లాక్ డౌన్ కారణంగా ఏపీలో చిక్కుకుని తీవ్ర అవస్థలు పడుతున్న వలస కూలీలకు ఆ రాష్ట్ర హైకోర్టు అండగా నిలిచింది.
అమరావతి: కరోనా విజృంభణ, లాక్ డౌన్ విధించడం కారణంగా ఉపాధి కోల్పోయిన వలస కూలీలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అటు స్వస్థలాలకు వెళ్లలేక ఇటు నివాసముంటున్న ప్రాంతంలో తినడానికి తిండి లేక అవస్థలు పడుతున్నారు. ఇలా ఏపిలో చిక్కుకుపోయిన ఇతర రాష్ట్రాలకు చెందిన వలసకూలీలకు హైకోర్టు అండగా నిలిచింది. వారికి సంబంధించి కీలక తీర్పు వెలువరించింది.
ఏపీలో చిక్కుకుపోయిన వలస కార్మికుల సమస్యలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. దీనిపై శనివారం విచారణ చేపట్టిన న్యాయస్థానం వలస కార్మికులను స్వస్థలాలకు పంపాలని, వారిని ఆదుకుని, నగదు, ఆహార భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.
undefined
హైకోర్టు తీర్పు పట్ల పిటిషనర్ రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పుతోనైనా ప్రభుత్వాలకు కనువిప్పు కలగాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. ఇకనైనా వలస కార్మికులను ఆదుకుని, వారికి ఆహార భద్రత కల్పించాలని వైసిపి ప్రభుత్వాన్నిఆయన డిమాండ్ చేశారు.
read more నడిచి వెళ్తున్న వలస కూలీలను చూసి చలించిపోయా: వైఎస్ జగన్
ఇదిలావుంటే శనివారం గుంటూరు జిల్లా తాడేపల్లిలో వలస కూలీలపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఈ లాఠీచార్జీలో పలువురు వలస కూలీలు గాయపడ్డారు. నడుచుకుంటూ స్వస్థలాలకు వెళ్తున్న వలస కూలీలపై పోలీసులు లాఠీచార్జీ చేశారు.
కొంత మంది వలస కూలీలు నడుచుకుంటూ, మరికొంత మంది సైకిళ్లపై తమ స్వస్థలాలకు వెళ్తున్న వలస కూలీలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని స్వయంగా పలకరించారు. ఆ తర్వాత అధికారులతో మాట్లాడి వలస కూలీలకు పునరావాస కల్పించి, వారిని స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో వారికి అధికారులు విజయవాడ క్లబ్ లో పునరావాసం కల్పించారు. వారికి శనివారం ఉదయం అల్పాహారం ఏర్పాటు చేశారు.
అల్పాహారం అందడంలో ఆలస్యం కావడంతో దాదాపు 150 మంది కూలీలు బయటకు వచ్చి తమ స్వస్థలాలకు దారి పట్టారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. వారిపై లాఠీచార్జీ చేశారు. దాంతో వారు తలో దిక్కు పరుగెత్తారు. ఆ తర్వాత వారిని విజయవాడ క్లబ్ కు చేర్చారు. వారి వివరాలను సేకరించారు.
ఉత్తరప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి వలస కూలీలు వచ్చారు. తమ స్వస్థలాలకు చేరుకోవడానికి ముందుకు సాగడానికి నిర్ణయించుకున్నారు. తమను పోలీసులు విచక్షణారిహతంగా కొట్టారని వలస కూలీలు ఆరోపిస్తున్నారు.