కొత్త విషయాలు చెప్పిన చంద్రబాబు

Published : Jan 04, 2017, 12:13 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
కొత్త విషయాలు చెప్పిన చంద్రబాబు

సారాంశం

పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా రావటంలో తన అనుభవమే కారణమన్నారు.  అయితే పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కినపుడు చంద్రబాబు ప్రతిపక్ష నేత.

పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు కొత్త విషయాలు శెలవిచ్చారు. తన అనుభవం వల్లే పోలవరానికి జాతీయహోదా, నాబార్డు రుణం వచ్చిందన్నారు. కేంద్రప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజిని గనుక తాను తీసుకోకపోతే పోలవరం ప్రాజెక్టుకు నిధులు వచ్చేవే కావన్నారు.

 

అనంతపురం జిల్లా బుక్కపురం మండలంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు.ఆ సందర్భంగా చంద్రబాబు చెప్పిన మాటలు విన్న వారికి ఆశ్చర్యమేసింది.

 

ఇప్పటి వరకూ అందరికీ తెలిసింది పోలవరం ప్రాజెక్టును మంజూరు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమని. దశాబ్దాల తరబడి మళ్ళీ ఎవ్వరూ పట్టించుకోలేదు.

 

తర్వాత 2004లో దివంగత వైఎస్ సిఎం అయిన తర్వాతనే కదలిక వచ్చింది. వైఎస్ కు ముందు చంద్రబాబు సిఎంగా పనిచేసారన్న విషయం అందరికీ తెలిసిందే.

 

2009లో వైఎస్ హటాత్తుగా మరణించటంతో మళ్ళీ బ్రేకులు పడింది.  ఆ తర్వాత తెలంగాణా రాష్ట్రం ఇవ్వక తప్పనపుడు యూపిఏ ప్రభుత్వం ఏపికి పోలవరం ప్రాజెక్టును మంజూరు చేస్తున్నట్లు విభజన చట్టంలోనే  చెప్పింది.

 

రాష్ట్ర విభజనలో పోలవరం ప్రాజెక్టును యూపిఏ ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. మామూలుగా అయితే, జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత సదరు ప్రాజెక్టును పూర్తిచేసే బాధ్యత కేంద్రానిదే.

 

అయితే, ఎన్డిఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను చంద్రబాబు కేంద్రానికి అప్పగించలేదు. దాంతో కేంద్రం కూడా ప్రాజెక్టుకు నిధుల కేటాయింపులో సీతకన్ను వేసింది.

 

ప్రాజెక్టును తమకు అప్పగించాల్సిందిగా కేంద్రం ఎన్నిమార్లు కోరినా చంద్రబాబు ససేమిరా అన్నారు. దాంతో చేసేదిలేక కేంద్రం పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్రానికే వదిలేసింది.

 

గడచిన రెండున్నర ఏళ్ళలో కేవలం 5 శాతం మాత్రమే ప్రాజెక్టు పనులు జరిగాయి. అయిపోయిన పనులకు గాను కేంద్రం మొన్ననే నాబార్డ్ ద్వారా రూ. 1981 కోట్లను అప్పును రీ ఎంబర్స్ మెంట్ రూపంలో ఇప్పించింది. ఇప్పటి వరకూ అందరికీ తెలిసింది ఇదీ. కానీ చంద్రబాబు బుధవారం ప్రాజెక్టుపై కొత్త విషయాలను చెప్పారు.

 

పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా రావటంలో తన అనుభవమే కారణమన్నారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కినపుడు చంద్రబాబు ప్రతిపక్ష నేత. ప్రతిపక్ష నేత పోలవరానికి జాతీయహోదా ఏ విధంగా సాధించగలిగారు? తన వల్లే నాబార్డ్ రుణం వచ్చిందంటున్నారు. కానీ ఇచ్చిన చెక్ రీ ఎంబర్స్ మెంట్ మాత్రమేనని అధికారులు చెబుతున్నారు.

 

పైగా కేంద్రం ప్రకటించిన ప్రత్యేకహోదా తీసుకోకపోతే పోలవరంకు నిధులొచ్చేది కాదని అంటున్నారు. మొత్తం ప్రాజెక్టు బాధ్యతే కేంద్రానిది కదా. చంద్రబాబు కేంద్రానికి ఇవ్వటానికి ఇష్టపడకపోవటం వల్లే ప్రాజెక్టు పనులు ఆలశ్యమైనట్లు ఇంతకాలం జనాలు అనుకుంటున్నారు.

 

ప్యాకేజి తీసుకోకపోతే పోలవరం వచ్చేదే కాదని కూడా అనటంతో అందరూ ఆశ్చర్యపోయారు. చూడబోతే చంద్రబాబు విషయంలో కెవిపి రామచంద్రరావు చెప్పింది నిజమేనేమో అని జనాలు అనుకుంటే అది వారి తప్పెంతమాత్రం కాదు.

 

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?