
నంద్యాల ఉపఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో టిడిపి పలువురితో ‘ఫైనాన్షియల్ డీల్’ కుదుర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. నంద్యాల పర్యటనలో శనివారం అర్ధరాత్రి తర్వాత నంద్యాల గెస్ట్ హౌస్ లో చంద్రబాబునాయుడు సమక్షంలోనే ఆ ముచ్చట జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. అసలు నంద్యాలలో చంద్రబాబు రాత్రి బస చేయాలన్న నిర్ణయం వెనుక ఇదే ప్రధాన కారణంగా నేతలే చెబుతున్నారు. ఆ డీల్ లో కూడా కేశవరెడ్డి బాధితులే ఎక్కువున్నట్లు సమాచారం. కేశవరెడ్డి విద్యాసంస్ధల అధినేత కేశవరెడ్డి గుర్తున్నాడా? అదేనండి ఆమధ్య తన విద్యాసంస్ధల్లో చదవే తల్లి, దండ్రుల నుండి దాదాపు రూ. 800 కోట్ల మేర డిపాజిట్లు సేకరించి తర్వాత జెండా ఎత్తేసిన పెద్దమనిషి. ఆయన బాధితులతోనే ఇపుడు టిడిపి డీల్ కుదుర్చుకుంటోందట.
ఉపఎన్నికలకు, కేశవరెడ్డికి ఏమిటి లింక్ అనుకుంటున్నారా? కేశవరెడ్డి బాధితులు నియోజకవర్గంలో సుమారు 30 వేలమంది ఉన్నారట. అన్ని వేలమంది అంటే మాటలా? అందుకే ఉపఎన్నికల ప్రచారంలో మంత్రి ఆదినారాయణరెడ్డి ప్రచారానికి వెళ్ళిన చోటల్లా బాధితులు మంత్రిని నిలదీస్తున్న సంగతి తెలిసిందే కదా? ముందు కేశవరెడ్డి నుండి తమ డబ్బు ఇప్పించి తర్వాతే ఓట్లు అడగటానికి రావాలంటూ జనాలు మంత్రిని నిలదీస్తుండటంతో మంత్రికి దిక్కుతోచలేదు. ఇంతకీ జనాలు మంత్రిని ఎందుకు నిలదీస్తున్నారంటే కేశవరెడ్డి, ఆదినారాయణరెడ్డి స్వయానా వియ్యంకుల్లేండి. అందుకే మంత్రికి బాధితులు చుక్కలు చూపిస్తున్నారు. అయితే, ఇదే విషయాన్ని నంద్యాల నేతలు చంద్రాబాబు దృష్టికి తీసుకెళ్ళారట.
అక్కడి నుండే వ్యూహరచన మొదలైంది. కేశవరెడ్డి బాధితుల్లో వివిధ వర్గాల్లో గట్టి వాళ్ళెవరో ముందు గుర్తించాలని చంద్రబాబు ఆదేశించారట. దాని ప్రకారమే ఇటీవలే టిడిపి నుండి పిరాయించిన కౌన్సలర్లలో కొందరిని గుర్తించారట. అలాగే వివిధ రంగాల్లోని పలువురు కీలక వ్యక్తులను కూడా స్ధానిక నేతలు గుర్తించారని సమాచారం. అటువారిలో కొందరిని టిడిపి నేతలు శనివారం అర్ధరాత్రి తర్వాత గెస్ట్ హౌస్ కు తీసుకొచ్చి చంద్రబాబుతో కలిపారట.
కేశవరెడ్డి తమవద్ద తీసుకున్న మొత్తాలు, వాటికైన వడ్డీ తదితరాలను బాదితులు సిఎం దృష్టికి తీసుకెళ్ళారట. దాంతో వారి డబ్బులన్నీ టిడిపి ఇచ్చేట్లు వారందరూ టిడిపి గెలుపుకు కృషి చేసేట్లుగా మాటలు జరిగాయని స్ధానిక నేతలే చెబుతున్నారు. అంటే దీన్ని బట్టే నంద్యాలలో టిడిపి గెలుపుకు చంద్రబాబు ఎంతగా కృషి చేస్తున్నారో అర్ధమైపోతోంది.