
‘పలానా సినిమా చూడండి’ అని సినిమా వాళ్లు చెప్పుకుంటారు. అది వారి అవసరం. ‘పలానా వస్తువునే కొనండి చాలా బావుంటుంద’ని ప్రకటనలు గుప్పిస్తుంటారు. అది వ్యాపారం. మరి చంద్రబాబునాయుడుకు ఏమి అవసరం వచ్చిందని తననే నమ్మమని బ్రతిమాలుకుంటున్నారు. అది కూడా నూరు శాతం నమ్మాలట. తనను నురుశాతం నమ్మకోమని ఏ రాజకీయనేత అయినా జనాలను బ్రతిమలాడుకుంటారా? అందులోనూ నిప్పు చంద్రబాబునాయుడు లాంటి వాళ్ళు. నమ్మకం బ్రతిమలాడుకుంటే వస్తుందా?
40 ఇయర్స్ ఇండస్ట్రి అసలు ప్రజలను బ్రతిమలాడుకోవటమేమిటి అసహ్యంగా? పైగా ‘చాలామంది ప్రజలు తనపైన నమ్మకముంచారు కాబట్టి మిగిలిన వారు కూడా తననే నమ్మాల’ట. ‘ఇప్పటి వరకూ తనను నమ్మని వాళ్ళు ఇప్పటికైనా మారాల’ట. ఎలాగుంది లాజిక్కు? చాలామంది నమ్ముతుంటే మిగిలిన కొద్దిమంది నమ్మితే ఎంత? నమ్మకపోతే ఎంత? వదిలేయచ్చుగా వాళ్ళ ఖర్మానికి వాళ్ళని. ‘అమరావతి రైతాంగం తనపై ఏ విధంగా నమ్మకంపెట్టుకుందో అదే విధంగా మిగిలిన వాళ్ళు కూడా నమ్మాల’ట. అమరావతి రైతులు నమ్మి ఏం బాగుపడ్డారో మాత్ర చెప్పటం లేదు.
‘రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించి అందరి కష్టాలను తీర్చే బాధ్యత తాను తీసుకుంటున్న’ట్లు చెప్పారు. 2017-18 బడ్జెట్లో అన్నీ వర్గాలకు సమన్యాయం చేసామని చెప్పారు. పేదరికం, వెనుకబడిన వర్గాలే కొలమానమట. తనకు కులం, మతం లేదని అందుకే అభివృద్ధికే పెద్ద పీట వేసినట్లు చెప్పుకున్నారు. పాలనా కాలంలో సగం అయిపోయింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఏమిటో జనాలకు అర్ధం కావటం లేదు. మరో రెండేళ్ళలో మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. తనను నమ్మమని ప్రజలను బ్రతిమలాడుకోవాల్సిన అవసరం చంద్రన్నకు ఇపుడేం అవసరం వచ్చిందట అసలు?