
ప్రభుత్వ పనితీరుపై ప్రజాభిప్రాయ సేకరణకు చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఓ యాప్ రూపొందించింది. ఈ రోజు ఆ యాప్ ను సిఎం ఆవిష్కరిస్తున్నారు. ప్రభుత్వంలోని వివిధ శాఖలపై ప్రజలు ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవటానికి యాప్ అన్నమాట. ‘కనెక్ట్ ఏపి సిఎం’ అనే యాప్ ద్వారా ప్రజలు శాఖల పనితీరుపై తామేమనుకుంటున్నారో చెప్పవచ్చన్నమాట. ఇందులో చాలా బాగుంది, బాగుంది, పర్వాలేదు, బాగాలేదు అనే ఆప్షన్లుంటాయి. వీటిల్లో ఏదో ఒకదాని ద్వారా తమ అభిప్రాయాన్ని జనాలు చెప్పవచ్చు.
వివిధ శాఖలపై చంద్రబాబు నిర్వహించబోయే సమీక్షల ముందురోజు ఆ శాఖల పనితీరుపై ప్రజాభిప్రాయ సేకరణ చేస్తారట. వచ్చిన ఫీడ్ బ్యాక్ ను సిఎం సమీక్షల్లో వివరిస్తారు. దాన్నిబట్టి శాఖల పనితీరు నిర్ణయిస్తారన్నమాట. ఇదంతా ఎలాగుందంటే, ఫీడ్ బ్యాక్ ఆధారంగా మంత్రులపైనో లేక ఉన్నతాధికారులపైనో ఆగ్రహం వ్యక్తం చేయటానికి పనికివస్తుంది. మొన్నటికి మొన్న ప్రధానమంత్రి కూడా ఓ యాప్ విడుదల చేసారు గుర్తుందా? పెద్ద నోట్ల రద్దు నేపధ్యంలో ప్రజాభిప్రాయ సేకరణ కోసం యాప్ ను ప్రధాని విడుదల చేసారు.
యాప్ ద్వారా ప్రజలను తమ అభిప్రాయాలను చెప్పమన్నారు. ఫలితం ఏమొచ్చింది? దేశవ్యాప్తంగా జనాలు డబ్బులకు బాగా అవస్తలు పడుతున్న సమయంలో కూడా ప్రధాని చర్యకు మద్దతిస్తూ 97 శాతం జనాలు పెద్ద నోట్ల రద్దుకు ఆమోదం తెలిపారని చెప్పారు. ఇపుడు ఈ యాప్ ఫలితాలు కూడా అదేవిధంగా ఉంటుందో ఏమొ?