
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఒక్కసారిగా వైసీపీకి మద్దతు ప్రకటించటం పట్ల పలువురు ఆశ్చర్యపోతున్నారు. గడిచిన మూడేళ్ళుగా ప్రత్యేకహోదాపై జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పోరాటాన్ని ఏమాత్రం పట్టించుకోని పవన్ హటాత్తుగా వైసీపీకి మద్దతు ప్రకటించటం వెనుక ఏమన్నా రాజకీయం మొదలైందా అని సర్వత్రా చర్చ మొదలైంది. దానికన్నా మించి టిడిపిలో అయోమయం నెలకొంది. పవన్ను ఏ విధంగా అంచనా వేయాలో అర్ధంకాక టిడిపి నేతలు జుట్టు పీక్కుంటున్నారు. ఇంతకాలం చంద్రబాబునాయుడు, తాను ఒక్కటే అనే అభిప్రాయాన్ని అందరిలోనూ పవనే కల్పించారు.
రాజధాని రైతుల భూముల వ్యవహారం కావచ్చు, అగ్రిగోల్డ్ బాధితుల వ్యవహారం కావచ్చు, రుణమాఫీలు ఇలా...వ్యవహారం ఏదైనా చంద్రబాబు చెప్పాలి. పవన్ నడుచుకోవాలి..అన్నట్లుగా సాగుతోంది వారిద్దరి మధ్య చెలిమి. అటువంటిది ఒక్కసారిగా ప్రత్యేకహోదాపై పార్లమెంట్ లో వైసీపీ ఎంపిలు బాగా పోరాటం చేస్తున్నారంటూ పవన్ కితాబు ఇవ్వటం గమనార్హం. పోనీ అంతటితో ఆగారా అంటే లేదు. టిడిపి ఎంపిలను ఏకిపారేసారు. విభజన సమయంలో టిడిపి ఎంపిలపై జరిగిన దౌర్జనాన్ని టిడిపి ఎంపిలు మరచిపోయారా అంటూ ప్రశ్నించారు.
ప్రత్యేకహోదాపై సభలో చర్చ జరుగుతున్నపుడు మంత్రి అశోక్ గజపతి రాజు ఉండి కూడా మద్దతుగా మాట్లాడకపోవటం ముమ్మాటికీ తప్పేనంటూ తీర్పు చెప్పేసారు. అదేవిధంగా చర్చలో పాల్గొనాల్సి వస్తుందన్న కారణంతో సభకు గైర్హాజరైన మిగిలిన ఎంపిలను కూడా పవన్ తప్పుపట్టారు. ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతినేసిందనే పెద్ద పదాన్నే ఉపయోగించారు. దాంతో పవన్ చేసిన ట్వీట్లపై టిడిపిలో పెద్ద దుమారం మొదలైంది.
మొన్నటి వరకూ పవన్ మన కాపేలే అనుకున్నారు తమ్ముళ్ళందరూ. అటువంటిది ఒక్కసారిగి పవన్ యూ టర్న్ తీసుకోవటంతో అందరూ విస్తుపోయారు. రేపటి రోజు కూడా పవన్ ఇదే విధంగా ట్వీటితే ఏం సమాధానం చెప్పాలా అని తెగ ఆలోచించేస్తున్నారు తమ్ముళ్ళు. వైసీపీకి పవన్ మద్దతు ఇక్కడితోనే ఆగుతుందా లేక ఇంకా ముందుకు సాగుతుందా అన్నది చూడాలి.