సెగ బాగానే తగులుతోంది

Published : Apr 21, 2017, 01:27 AM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
సెగ బాగానే తగులుతోంది

సారాంశం

చిత్తూరు మినహా మిగిలిన మూడు జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో వర్గ రాజకీయాలు బాగా ఊపందుకున్నాయి. ఇందులో ఏ ఒక్క నియోజకవర్గంలోని వివాదాన్ని కూడా చంద్రబాబు పరిష్కరించే స్ధితిలో లేరన్నది వాస్తవం.

చంద్రబాబునాయుడుకు రాయలసీమ సెగ బాగానే తగులుతోంది. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో ఒక్క చిత్తూరు మినహా మిగిలిన కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలు వర్గ రాజకీయాలకు పెట్టింది పేరు. ఇపుడు బాగా తగ్గింది కానీ ఒకపుడు ఫ్యాక్షన్ రాజకీయాలు, హత్యలు విపరీతంగా ఉండేవి. 40 ఇయర్స్ ఇండస్ట్రీనే అయినా చిత్తూరు జిల్లా కావటంతో ఎప్పుడూ చంద్రబాబుకు వర్గ రాజకీయాలు నడపాల్సిన అవసరం కానీ తనకంటూ ప్రత్యేకంగా ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అగత్యం కానీ ఎదురుకాలేదు. ఏదో తనదైన శైలిలో దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తూ నెట్టుకొచ్చేస్తున్నారు.

చంద్రబాబు రాజకీయం విచిత్రంగా ఉంటుంది. ఎవరు ఎంత కొట్టుకున్నా అందరూ తనమాటే వినాలని అనుకుంటారు. అయితే, వర్గ రాజకీయాల్లో అన్నీ సార్లు అది సాద్యం కాదు. ప్రస్తుత పరిస్ధితులు చూస్తుంటే ఆమాట నిజమేననిపిస్తోంది. మూడోసారి సిఎం అయిన దగ్గర నుండి చంద్రబాబుకు పార్టీలోనూ ప్రభుత్వంలోనూ పట్టు జారిపోయిందనే ప్రచారం జరుగుతోంది. ఫిరాయింపుల రాజకీయాల పేరుతో వైసీపీ నుండి 21 మంది ఎంఎల్ఏలను పార్టీలో చేర్చుకున్న తర్వాత పార్టీలో అంతర్గతంగా గొడవలు బాగా ఎక్కువైపోయాయి.

చిత్తూరు మినహా మిగిలిన మూడు జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో వర్గ రాజకీయాలు బాగా ఊపందుకున్నాయి. ఇందులో ఏ ఒక్క నియోజకవర్గంలోని వివాదాన్ని కూడా చంద్రబాబు పరిష్కరించే స్ధితిలో లేరన్నది వాస్తవం. నంద్యాల ఉప ఎన్నికలో అభ్యర్ధి ఎంపిక అంశాన్నే ఉదాహరణగా తీసుకోవచ్చు. రెండు బలమైన వర్గాలు టిక్కెట్టు కోసం రోడ్డెక్కినా ఇంత వరకూ పరిష్కరించలేకపోతున్నారు. అదేవిధంగా అనంతపురం జిల్లాలో జెసి సోదరులకు, అనంతపురం ఎంఎల్ఏ ప్రభాకర్ చౌదరికి ఉప్పు-నిప్పు. అలాగే, పరిటాల వర్గంతో కూడా జెసి సోదరులకు పడదు. పరిటాల వర్గానికి పార్టీలోనే ఉన్న పలువురు సీనియర్ నేతలతో పొసగదు. జిల్లాలోని ఏవర్గాన్ని కూడా చంద్రబాబు అదుపులో పెట్టలేకున్నారు.

ఇక, కడప జిల్లాలోని జమ్మలమడుగు, బద్వేలు, ప్రొద్దుటూరు, కమలాపురం, పులివెందుల నియోజకవర్గాల్లో కూడా అంతర్గత పోరు చాలా ఎక్కువుగా ఉంది. దానికితోడు ఫిరాయింపు ఎంఎల్ఏ ఆదినారాయణరెడ్డికి మంత్రిపదవి ఇచ్చిన తర్వాత వివాదాలు మరింత ఎక్కువయ్యాయి. ఇదిలా వుండగా ఇతర జిల్లాల్లలో కూడా పరిస్ధితి దాదాపు ఇదే విధంగా ఉన్నాయి. ప ప్రతి నియోజవకర్గంలోనూ రెండు మూడు గ్రూపులు తయారై ఆధిపత్యం కోసం గోొడవలు పడుతున్నా ఏ గ్రూపునూ చంద్రబాబు అదుపులో పెట్ట లేకున్నారు. ఇప్పుడే వివాదాలు ఈ స్ధాయిలో ఉంటే ఎన్నికలు దగ్గర పడే కొద్దీ  సెగ ఇంకే స్ధాయికి చేరుకుంటుందో, చంద్రబాబు అప్పుడేం చేస్తారో చూడాలి.

 

 

 

PREV
click me!

Recommended Stories

YS Jagan Sensational Comments: మేము అధికారంలోకి వస్తే వాళ్లందరూ జైలుకే | Asianet News Telugu
డ్రెయిన్స్ పొల్యూషన్ లేకుండా చెయ్యండి:Chandrababu on Make Drains Pollution Free| Asianet News Telugu