
ఐవైఆర్ ను తొలగించిన ప్రభుత్వం తన చర్యను సమర్ధించుకోవటానికి నానా తంటాలు పడుతోంది. బ్రాహ్మణకార్పొరేషన్ ఛైర్మన్ గా ఐవైఆర్ ను ప్రభుత్వం ఈరోజు తొలగించిన సంగతి తెలిసిందే కదా? దానిపై అన్ని వైపుల నుండి విమర్శలు మొదలైంది. ఒక బ్రాహ్మణుడిని తప్పించిన చర్యను సమర్ధించుకోవటానికి ప్రభుత్వ సలహాదారుగా ఉన్న మరో బ్రాహ్మణడు పరకాల ప్రభాకర్ ను చంద్రబాబు రంగంలోకి దింపారు. అయతే, మీడియా ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక పరకాల నానా అవస్తలు పడటం స్పష్టంగా కనబడింది.
ఒకవైపు ఐవైఆర్ గొప్పవ్యక్తి, పరిపాలనాధక్షుడు, మ్యాన్ ఆప్ ఇంటిగ్రిటీ అని పొగుడుతూనే ఇంకోవైపు కృష్ణారావు తప్పు చేసారు కాబట్టి ప్రభుత్వం తీసేసిందని చెప్పటం పరకాలకే చెల్లింది. బ్రాహ్మణకార్పొరేషన్ అభివృద్ధికి ఐవైఆర్ ఎంతో కృషి చేసారని చెప్పటం కొసమెరుపు. ప్రభుత్వంలో బాధ్యత గల పదవిలో ఉంటూనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టటం చేసారు కాబట్టే కార్పొరేషన్ కు ఆయన సేవలు అవసరం లేదని చెప్పారు. మరి అదే పనులు చేసిన ఇతరుల సంగతేమిటి అన్న ప్రశ్నకు పరకాల వద్ద సమాధానం లేదు.
ఆరుమాసాలుగా ప్రయత్నిస్తున్నా సిఎం అపాయింట్మెంట్ దొరకలేదని ఐవైఆర్ చెప్పటం పూర్తిగా అబద్దమన్నారు. మార్చి, ఏప్రిల్లో జరిగిన కలెక్టర్ల సమావేశం సందర్భంగా కూడా ఐవైఆర్ సిఎంను కలిసారని చెప్పారు. తనకు ఆరుమాసాలుగా సిఎం అపాయింట్మెంట్ దొరకటం లేదని ఒకవైపు కృష్ణారావు చెబుతుంటే, అదంతా అబద్దమని పరకాల ఎలా చెప్పగలుగుతారు? అసలు, ఐవైఆర్ సిఎంను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తే పరకాల సమాధానాలు చెప్పటమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. చంద్రన్న నీతి అదేకదా? ఏ కులం వారిని తిట్టించాలంటే అదే కులాన్ని రంగంలోకి దింపటమే చంద్రబాబు వ్యూహం.