
కార్పొరేషన్ విషయాలు మాట్లాడాలని ఆరు నెలలు ప్రయత్నించినా అపాయింట్మెంట్ ఇవ్వకుండా చంద్రబాబునాయుడు ఇబ్బంది పెట్టినట్లు బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు చెప్పారు. వివాదంలో ఇరుక్కున్న ఐవైఆర్ ఈరోజు మీడియాతో మాట్లాడారు. ఫేస్ బుక్ లో తాను పెట్టిన పోస్టింగులను సమర్ధించుకున్నారు. తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క పోస్టు కూడా పెట్టలేదన్నారు. పైగా తాను పెట్టిన పోస్టింగులపై ఇంతవరకూ ప్రభుత్వం ఒక్కసారి కూడా వివరణ అడగలేదని పేర్కొన్నారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారంటూ ఐవైఆర్ పై టిడిపి నేతలు మండిపడుతున్నారు. దానికి తగ్గట్లే, ఈరోజు ఛైర్మన్ గా ఐవైఆర్ ను ప్రభుత్వం తొలగించింది. ఆ విషయాలపై మీడియాతో మాట్లాడుతూ, కార్పొరేషన్ తరపున పారదర్శకతతోనే లబ్దిదారులను ఎంపిక చేసినట్లు తెలిపారు. లబ్దిదారుల ఎంపిక జాబితాను ముఖ్యమంత్రికి పంపినట్లు చెప్పారు. వైసీపీ సానుభూతిపరులకే ఎక్కువ నిధులు ఇస్తున్నానని, వైసీపీ ఎంఎల్ఏలనే కలుస్తున్నానని తనపై వచ్చిన ఆరోపణలు కొట్టేసారు.
తాను ఏ జిల్లాకు వెళ్ళినా అక్కడి కో-ఆర్డినేటర్ కు సమాచారం ఇస్తానన్నారు. సమావేశానికి ఎవరిని పిలవాలన్నది కో ఆర్డినేటరే చూసుకుంటారని స్పష్టం చేసారు. అందులో టిడిపి ఎంఎల్ఏలు లేకపోతే అది తన తప్పు కాదన్నారు. పేస్ బుక్ లో పోస్టులు పెట్టటం, పెట్టిన పోస్టింగులకు మద్దుతు తెలపటం వ్యక్తిగా తనకున్న స్వేచ్చ అని సమర్ధించుకున్నారు. ‘మనది రాజరిచకమా లేక ప్రజాస్వామ్యమా’ అని సందేహం వ్యక్తం చేసారు.
ఇంటూరి రవికిరణ్ ను పోలీసులు అరెస్టు చేయటాన్ని తాను తప్పు పట్టినట్లు చెప్పారు. రాజకీయ కార్టూన్లు వేస్తే నవ్వుకోవాలే గానీ కక్షపూరితంగా వ్యవహరిస్తే ఎలా అంటూ ప్రశ్నించారు. గౌతమీపుత్ర శాతకర్ణికి పన్నుమినహాయింపు ఇవ్వటాన్ని తాను తప్పు పట్టింది వాస్తవమేనన్నారు. చరిత్రను వక్రీకరించి తీసిన సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వటమేంటన్నారు. బాహుబలి సినిమా ఎక్కువ స్క్రీన్లలో వేసుకునేందుకు ఎందుకు అనుమతివ్వాలని అడిగారు.
టిడిపి ఇఓగా ధక్షిణాది వారిని కాదని ఉత్తరాధి వారిని వేయాల్సిన అవసరం ఏంటని ప్రభుత్వాన్ని నిలదీసారు. ప్రభుత్వానికి భజన చేయాలంటే తన వల్ల కాదన్నారు. తాను స్వతంత్ర్యంగా పనిచేయటాన్ని ప్రభుత్వంలోని కొందరు ఓర్చుకోలేకపోయినట్లు ఐవైఆర్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంలో ఏం జరుగుతోందో ప్రజలకు తెలియజెప్పే న్యూట్రల్ మీడియా లేకపోవటం పెద్ద సమస్యగా మారిందన్నారు.