ఆయనే లేకుంటే...

Published : Jan 05, 2017, 03:12 AM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
ఆయనే లేకుంటే...

సారాంశం

 ఈ రాష్ట్రం ఏమైపోయేదో... తల్చుకుంటే భయమేస్తోంది కదూ

భయమేస్తున్నది మనకు కాదు,  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిగారికి.

 

తనే లేకపోతే, ఈ  రాష్ట్రం ఎలా ఉండేదో ... ఈ భయాందోళనను ఆయన కొద్ది సేపు విలేకరులతో పంచుకున్నారు. 

 

నిన్న తిరుపతి దగ్గిర సైన్స్ మ్యూజియం కు శంకుస్థాపన చేశాక, విలేకరులతో కలసి  కొంత దూరం అలా ముందుకు నడచి, చట్టూ కలియచూశారు.  ఎదురుగా ఏడుకొండలు, మధ్య ఒకచోట తాపల దారి, పక్కనే శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం, ఆ పక్కనే అలిపిరి... ఇవన్నీ కలసి ఆయన్నీ గతంలో లాక్కెళ్లాయి.

 

‘ఈ తిరుపతిని ఎంతగానో డెవలప్ చేయాలనుకున్నాను. నేనేమో పరిగెడుతున్నా. వారేమో నాతో రాలేక పోతున్నారు,’ తన చట్టు ఉన్న ఆఫీసర్ల గురించి, యంత్రాంగం మీద ఆయన ఒక వేడి నిట్టూర్పు విడిచారు.

 

‘కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. వాటిని అధిగమించి అభివృద్ధే లక్ష్యంగా నిరంతరం పోరాడుతున్నా. విరామం లేకుండా  శ్రమిస్తున్నా. క్షణం తీరిక లేకుండా పరుగులు పెడుతున్నా.అయినా, దురదృష్టం. కొందరు అధికారులు మాత్రం నన్ను అందుకోలేకపోతున్నారు. లక్ష్యాన్ని సాధించలేకపోతున్నారు,’ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

 

‘ చిన్నపాటి లోపాలు ఉన్నాయి.. వాటిని సరిదిద్దుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది.. అయినా నవ్యాంధ్ర అభివృద్ధికి నేను మరింతగా శ్రమిస్తా. వెనకంజనేదేలేదు’ అని కచ్చితంగా తేల్చి చెప్పేశారు.

 

కొంతమంది విలేకరులు లీనమయి వింటూంటే, మరికొందరు విస్తుపోయి చూస్తుండిపోయారు.  గతంలో చోటుచేసుకున్న అలిపిరి సంఘటన, తన విద్యాభ్యాసం తదితర విషయాలను ఆయన ప్రస్తావించారు. ఈ మధ్యలో కలెక్టర్‌ సిద్ధార్థ్‌జైన్‌ ను పిలిచి అంతర్జాతీయ సైన్స్‌ మ్యూజియం నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని తక్షణమే సిద్ధం చేయాలని హకుం జారీ చేశారు.

 

 తర్వాత  మరికొంత ముందుకు నడిచారు.

 

‘ అదిగో అక్కడ కనపడుతోంది కదా, ఎస్వీయూ... అందులో చదువుకున్నాను.  ఇక్కడే నాయకుడిగా ఎదిగాను. అపుడు టిటిడి  నిధులిచ్చి మా కళాశాలకు సహకరించింది. అదే సాయం మునుముందు కొనసాగేలా చేస్తాం. భవిష్యత్తులో ఏ విద్యార్థి ఇబ్బంది పడకూడదన్నదే నా ఆశయం,‘ అని అన్నారు.

 

అక్కడే ఉన్న స్థలాన్ని పరిశీలిస్తూ ఇంకొంత ముందుకు సాగారు. అక్కడ కనిపించిన ఎర్రచందన చెట్లను చూసి,ఒక నిమిషం పాటు  ఆగి, వాటిని నరకకుండా.. ప్రత్యేక యంత్రం సహాయంతో వేర్లతో సహా పెకిలించి వేరే చోటకు తరలించండని ఆదేశించారు.

 

అలా మాట్లాడుతూ, ఆదేశాలిస్తూ ముందుకు సాగుతూ ఆయన పక్కనే ఉన్న ఏడుకొండలను చూపుతూ నాటి విషాద సంఘటన అలిపిరి దాడిని గుర్తు చేసుకున్నారు.

 

‘స్విమ్స్‌ ఆసుపత్రిలో  ప్రాణదానం’ పథకాన్ని ప్రారంభించి తిరుమలకు వెళ్తుండగా నా మీద  దాడి జరిగింది. ఏడుకొండల స్వామి ఆశ్సీసులతో నేను బతికిబయటపడ్డాను,’ అని బరువెక్కిన హృదయంతో చెప్పారు.

 

అనంతరం తిరుపతి అభివృద్ధి గురించి మాట్లాడుతూ ‘ఎన్నో కార్యక్రమాలు చేపట్టాను. ఆదే సమయంలో తిరుపతి పవిత్రతను కాపాడేందుకు పటిష్ఠ చర్యలు తీసుకున్నా. పచ్చదనాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నా.  దీని వల్ల  వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.  ఇలా ఎన్నో ఏర్పాటు చేస్తున్నా.. అభివృద్ధే ధ్యేయంగా పరిగెడుతున్నా.. నేను చెప్పినంతగా మావాళ్లు పరిగెత్తడం లేదు.. నాకు పనులు త్వరితగతిన జరగాలి. అంతే. అవిలాల చెరువు అభివృద్ధిని టిటిడికి అప్పగిస్తే సకాలంలో పూర్తి చేయలేకపోయింది. కొన్ని సమస్యలు ఉన్నాయి.ఎవరొచ్చినా రాకపోయినా,అన్నింటిని సరిదిద్దుకుని ముందుకు సాగుతా’ అని ముఖ్యమంత్రి శపథం చేస్తున్నట్లు చెప్పారు.

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?