బ్యాంకుల మీద మండిపడ్డ చంద్రబాబు

First Published Sep 22, 2017, 6:41 PM IST
Highlights

వచ్చే నెలాఖరు వరకు గడువిస్తున్నా..
పంథా మారాల్సిందే!
ప్రభుత్వ పథకాల అమలుపై శ్రద్ధ ఏది?

పేదలకు రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకుల అనుసరిస్తున్న తీరు మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు  మండి పడ్డారు.  రుణ మంజూరు కోసం తగిన పత్రాలతో వెళ్లినా బ్యాంకులు సకాలంలో స్పందించడం లేదని తమకు ఫిర్యాదులు అందుతున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. ఇది ప్రభుత్వానికి అప్రతిష్ఠ తెస్తోందని, ఇది కొనసాగడానికి వీల్లేదని హెచ్చరించారు. బ్యాంకులు ఈ విషయంలో తమ పనితీరు మార్చుకోవటానికి వచ్చే నెల 31 వరకు సమయమిస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.  బ్యాంకుల ప్రతినిధులు, ప్రభుత్వ ప్రతినిధులతో సమన్వయకమిటీ నియమించనున్నట్లు ఆయన వివరించారు.

శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర స్థాయి ద్విశత (200వ) బ్యాంకర్ల సమావేశాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తూ.. రుణ మంజూరు పత్రాలు ఇచ్చినా చెల్లించడానికి ఇబ్బంది ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు చెరుకూరి కుటుంబరావు స్పందిస్తూ సమన్వయానికి ఓ కమిటీ అవసరమని సూచించగా ముఖ్యమంత్రి వెంటనే అందుకు అంగీకరించారు. ఈ కమిటీలో  ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు చెరుకూరి కుటుంబరావు, ఆర్ధిక శాఖ, వ్యవసాయ శాఖ, పరిశ్రమలు, సంక్షేమ శాఖల నుంచి ఒక్కొక్కరు, ఆంధ్రాబ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, ఆర్.బి.ఐ నుంచి ఒక్కొక్కరు చొప్పున మొత్తం పదిమంది కమిటీలో సభ్యులుగా ఉంటారు.


కౌలు రైతులకు లక్ష వరకు వడ్డీలేకుండా రుణాలు ఇస్తున్న విషయాన్ని సమావేశంలో  ఎస్.ఎల్.బి.సి కన్వీనర్ ఆంధ్రాబ్యాంక్ సర్కిల్ జనరల్ మేనేజర్ జి.ఎస్.వి. కృష్ణారావు ప్రస్తావించగా ముఖ్యమంత్రి స్పందిస్తూ వ్యవసాయ రుణాలలో 10% కౌలు రైతులకు చెల్లించాలని బ్యాంకర్లకు విజ్ఞప్తి చేశారు.

భూమి యజమానులైన రైతుల ప్రయోజనాలు దెబ్బతినకూడదని, వారికి మేలుజరిగేలా ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాల్సి ఉందని తెలిపారు. రుణపత్రాలు ఇచ్చినా బ్యాంకులు వెంటనే రుణాలు చెల్లించడం లేదన్న ఫిర్యాదులపై సమావేశంలో కొద్దినిమిషాల చర్చ జరిగింది.  ఈనేపథ్యంలోనే ముఖ్యమంత్రి సమన్వయ కమిటీ నిర్ణయాన్ని ప్రకటించారు. 


 

click me!