
వచ్చే ఎన్నికల్లో కూడా అధికారం అందుకునే విషయంలో చంద్రబాబునాయుడు బాగా నమ్మకంతో ఉన్నారు. బహుశా నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో గెలుపే అంతటి ఆత్మస్ధైర్యాన్ని ఇచ్చినట్లుంది. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో కూడా టిడిపినే గెలుస్తుందంటూ నమ్మకంగా చెప్పారు. 2019లోనే కాకుండా 2024, 29లో కూడా తమదే అధికారమని బలగుద్ది చెప్పారు. ప్రజలకు మంచి చేస్తే ప్రజలు కూడా ఆధరిస్తారన్న నమ్మకంతోనే తాను పనిచేస్తున్నట్లు చెప్పారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. దేశం మొత్తం మీద 1999లో తాను మాత్రమే అబివృద్ధి అజెండాతో గెలిచినట్లు తెలిపారు.
సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో ఎన్నికలను చూసానని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 1989-95 మద్య అయితే ఎన్ని ఎన్నికలు వచ్చాయో లెక్కే లేదన్నారు. కాబట్టి తాను ఎన్నికలకు భయపడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. తానెప్పుడూ ప్రజల గురించే ఆలోచిస్తానన్నారు. అందుకే ప్రజల వద్దకే ప్రభుత్వం అన్న పద్దతిలో ‘‘ఇంటింటికి టిడిపి’’ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. 11 రోజుల కార్యక్రమంలో తమ నేతలు, శ్రేణులు 20 లక్షల ఇళ్ళకు వెళ్ళారని చెప్పారు. 2, 32,740 పిటీషన్లు అందినట్లు తెలిపారు. అందులో 2,16,695 పిటీషన్లు వ్యక్తిగతంగా పేర్కొన్నారు. 16,051 కమ్యూనిటీ సమస్యలట. అందులో కూడా42,378 ఇళ్ళ గురించి, 34053 మంది ఇంటి స్ధలాల కోసం దరఖాస్తు అందచేసారని చెప్పారు.
పనిలో పనిగా గతంలో ఎన్నడూ లేనివిధంగా, తన దినచర్యను గురించి వివరించారు. ప్రతీ రోజు అర్ధగంటపాటు వ్యాయామం చేస్తారట. 20 నిముషాల పాటు విజువలైజేషన్ చేస్తారట. ‘‘బ్రతకటం కోసమే తింటాను గానీ తినటం కోసమే బ్రతకనం’’టూ సరదాగా వ్యాఖ్యానించారు. తనకు శక్తినిచ్చే ఆహారమే తీసుకుంటానన్నారు. పండ్లు కూడా వారానికి ఒకటే తీసుకుంటానన్నారు. టెమ్టేషన్లు కంట్రోల్ చేసుకోవాలని స్పష్టం చేసారు.