
ఏర్పేడు ఘటనను అందరూ కుట్ర కోణంగా అనుమానిస్తుంటే చంద్రబాబునాయుడు మాత్రం కేవలం రవాణాశాఖ వైఫల్యంగానే పరిగణిస్తున్నారు. మంగళవారం జిరిగిన విశాఖధిపతుల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ, రవాణాశాఖ వైఫల్యం కారణంగానే ప్రమాదం జరిగిందని తేల్చేసారు. ఘటనను ముఖ్యమంత్రే ప్రమాదమని తేల్చేసిన తర్వాత ఇక ఎవరు మాత్రం కుట్ర కోణంలో విచారణ జరుపుతారు.
ప్రమాదం జరిగిన తీరును బట్టి పలువురు అనేక అనుమానాలు వ్యక్తం చేసారు. అధికార పార్టీలోని నేతల హస్తంపై ఆరోపణలు కూడా చేసారు. అయినా ముఖ్యమంత్రి వాటిని ఏమాత్రం పట్టించుకోకపోవటం గమనార్హం. పైగా మూడు చెక్ పోస్టులు దాటిన తర్వాతే వాహనం వచ్చిందని, కాబట్టి ఏ చెక్ పోస్టు వద్ద అధికారులు లారీని అడ్డగించినా ప్రమాదం జరిగి ఉండేది కాదంటూ సిఎం అభిప్రాయపడటం గమనార్హం.
అంటే చెక్ పోస్టుల్లో పనిచేసే సిబ్బందిపైనే చర్యలు తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఉచిత ఇసుక పక్కదారి పడుతోందంటూ సిఎం ఆవేదనలో అర్ధమేలేదు. ఎందుకంటే, ఉచిత ఇసుక పక్కదారి పట్టటానికి స్వయంగా ముఖ్యమంత్రే కారణం.
ఇసుక అక్రమరవాణాలో ఎవరెవరికి భాగస్వామ్య ముందో తెలిసీ ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా అక్రమ రవాణాను అరికట్టాలనుకున్న వానజాక్షి లాంటి అధికారులపై అధికార పార్టీ ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ లాంటి వాళ్ళు ధౌర్జన్యాలు చేస్తున్న కేసులే నమోదు కావటం లేదు. అందుకనే ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా అధికారులు పట్టించుకోలేదు.
తప్పు చేస్తున్న అధికారులు ఏ స్ధాయిలో ఉన్నా చర్యలు తప్పవని హెచ్చరికలొకటి. అసలు తప్పులు చేస్తున్నదే అధికారపార్టీ నేతలు. మూడేళ్ళల్లో ఏ నేతపైనా చర్యలు తీసుకున్న ఘటన ఒక్కటీ లేదు.
మొన్నటికి మొన్న రవాణా శాఖ కమీషనర్ పై ధౌర్జన్యానికి పాల్పడిన ఎంపి కేశినేని నాని, ఎంఎల్ఏ బోండా ఉమ, ఎంఎల్సీ బుద్దా వెంకన్నలపై ఏం చర్యలు తీసుకున్నదీ అందరూ చూసిందే. స్వయంగా ముఖ్యమంత్రే కమీషనర్-ప్రజాప్రతినిధుల మధ్య పంచాయితీలు చేస్తే ఇక అధికారులు ఎవరు మాత్రం నోరు విప్పగలరు?