
‘‘చూడు ఒకవైపే చూడు’’ అని బావమరది నందమూరి బాలకృష్ణ సినిమాలో ఓ డైలాగుంది. ఈ రోజు చంద్రబాబునాయుడు చెప్పింది కుడా అదే స్టైల్లో ఉంది. ఇంతకీ ఆ డైలాగ్ ఏంటంటే, ‘‘ 2019లో ఎలక్షన్ వనసైడ్ గా జరగాలి’’ అని. ప్రతిపక్షం చిత్తుచిత్తుగా ఓడిపోవాలట. మొత్తం 175 సీట్లూ టిడిపినే గెలవాలట. ఎలక్షన్ వన్ సైడ్ గా జరగాలంటే డ్వాక్రా మహిళలతో పాటు అందరూ టిడిపికే ఓట్లు వేయాలట. పార్టీ కార్యక్రమం పేరు చెప్పి డ్వాక్రా మహిళలకు చంద్రబాబు చేసిన హెచ్చరికిది.
పేరుకేమో ‘‘ఇంటింటికి తెలుగుదేశం’ అన్నది పార్టీ కార్యక్రమం. కానీ చెప్పేదేమిటంటే డ్వాక్రా సంఘాలు తెలుగుదేశంపార్టీ కోసం పనిచేయాలని. సోమవారం శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ నియోజకవర్గంలో చంద్రబాబు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలోని 90 లక్షల మంది డ్వాక్రా మహిళలు పార్టీతో కలిసి పని చేయాలట. అంటే, టిడిపికి ఓటు బ్యాంకును చంద్రబాబు విస్తృతపరుచుకుంటున్నారన్నది స్పష్టమైపోతోంది.
గ్రామాల్లోని పార్టీ కార్యకర్తలు, డ్వాక్రా సభ్యులు కలిసి పనిచేస్తే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయట. నిజానికి డ్వక్రా గ్రూపులకు, టిడిపికి ఏమీ సంబంధం లేదు. డ్వాక్రా గ్రూపులన్నది ప్రభుత్వంలో ఓ భాగం. ఈ రోజు జరిగింది కేవలం పార్టీ కార్యక్రమమే. కానీ చంద్రబాబు పిలుపిచ్చిందేమో డ్వాక్రా గ్రూపులు టిడిపితో కలిసి పనిచేయాలని. అంటే అర్ధమేంటి? డ్వాక్రా గ్రూపులన్నీ తెలుగుదేశంపార్టీ కోసమే పనిచేయాలని చెప్పటమే. తానే డ్వాక్రా గ్రూపులను ప్రారంభించాను కాబట్టి డ్వాక్రా మహిళలందరూ టిడిపికే పనిచేయాలట.
తొందరలో ప్రతీ బూత్ పరిధిలోని 25 ఇళ్ళకు టిడిపి నుండి ఓ కార్యకర్తను నియమిస్తారట. వారితో డ్వాక్రా సభ్యురాలు కలిసి పనిచేయాలట. డ్వాక్రా సభ్యురాళ్ళు, టిడిపి కార్యకర్తలు ఎవరికి వారుగా పనిచేస్తే ఇబ్బందులొస్తాయట. అందుకని డ్వాక్రా సంఘాలు టిడిపితో కలిసి పనిచేయాలట. ఆ 25 ఇళ్ళలోని అందరి బాగోగులు డ్వాక్రా మహిళలు గమనించుకోవాలన్నారు. సరే, పనిలో పనిగా పేరు చెప్పకుండానే వైసీపీ మీదకుడా విరుచుకుపడ్డారులేండి. ప్రతీ అభివృద్ధి కార్యక్రమానికి అడ్డుపడుతున్న ప్రతిపక్షాన్ని చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.