
మామూలుగా ఎన్నికలొస్తే ప్రతిపక్షం అది చేస్తాం..ఇది చేస్తామంటూ హామీలిస్తుంది. అధికారంలో ఉన్న పార్టీ అప్పటి వరకూ తాము చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తుంది. ఎక్కడైనా జరిగేది ఇదే. కానీ కాకినాడలో చంద్రబాబునాయుడు విచిత్రంగా వ్యవహరిస్తున్నారు. కాకినాడ కార్పొరేషన్లో తమను గెలిపిస్తే తాము అధి చేస్తాం..ఇది చేస్తాం..అంటూ హామీలతో ఊదరగొడుతున్నారు. పోనీ ఆ హామీలేమైనా కొత్తవా అంటే అదీ కాదు. 2014 సాధారణ ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే మళ్ళీ మళ్ళీ గుప్పిస్తున్నారు.
ఒకవైపు కాకినాడ ఎన్నికల్లో టిడిపి ఓడిపోయినా తమకు నష్టమేమీ లేదని చెబుతూనే టిడిపిని గెలిపించుకోవాల్సిన అవసరం జనాలకే ఉందంటూ ఎదరుదాడి చేయటం విచిత్రంగా ఉంది. కాకినాడ అభివృద్ధి జరగాలంటే టిడిపినే గెలిపించాలట. కాకినాడలో డ్రైనేజీనే ప్రధాన సమస్యగా చెబుతున్నారు. డ్రైనేజీనే ప్రధాన సమస్య అని తెలిసినపుడు మరి మూడున్నరేళ్ళు ఏం చేసినట్లు?
ప్రతి ఒక్కరికీ ఇళ్ళు కట్టిస్తారట. మంజూనాధ కమీషన్ రిపోర్టు రాగానే కేంద్రానికి పంపి అనుమతులు రాబడుతామని చెప్పారు. ఒకవైపు హామీలిస్తూనే ఇంకోవైపు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున హామీలివ్వలేక పోతున్నట్లు చెబుతుండటం గమనార్హం. కాకినాడలో విశాలమైన రోడ్లున్నా సముద్రంతోనే పెద్ద సమస్యట. సముద్రం పొంగినపుడల్లా నీరు పొంగి రోడ్లపైకి వచ్చేస్తోందట. మరి సముద్రాన్ని ఏం చేద్దామనుకుంటున్నారో చంద్రబాబు.