
‘‘ప్రత్యేక ప్యాకేజీ క్రింద రాష్ట్రానికి కేంద్రం నిధులు విడుదల చేయటం లేదు’’..ఇది చంద్రబాబునాయుడు తాజా ఆవేధన. గడచిన మూడేళ్ళ నుండి కేంద్రం నుండి రావాల్సిన రూ. 14 వేల కోట్లు రాలేదట. అందుకే నిధులు రాబట్టుకునేందుకు కేంద్రంతో పోరాటం చేస్తున్నారట. నీటి పారుదల ప్రాజెక్టులకు కేంద్రం నిధులు విడుదల చేయకపోయినా ఎలాగోలా నిధులు సమకూర్చుకుని ప్రాజెక్టు పనులు చేస్తున్నామని చంద్రబాబు చెబుతున్నారు. చంద్రబాబు చెప్పిందాంట్లో తప్పేమీలేదు అంతా నిజమే. కాకపోతే చంద్రబాబే ఒక విషయం మరచిపోయారు.
కేంద్రం ప్రత్యేకప్యాకేజిని ఎప్పుడూ ప్రకటించలేదు. రాష్ట్రంలో ప్రత్యేకహోదా కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినపుడు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ రాష్ట్రానికి ‘‘ప్రత్యేక సాయం’’ (స్పెషల్ అసిస్టెన్స్) అంటూ ఓ ప్రకటన పడేసారు. దాన్ని చంద్రబాబు, మంత్రులు ప్రత్యేకప్యాకేజి అంటూ ఊదరగొట్టారు. కేంద్రం ప్రకటించిన ప్రత్యేకప్యాకేజికి చట్టబద్దత కల్పించాలని చంద్రబాబు ఎన్నిమార్లు కేంద్రాన్ని అడిగినా పట్టించుకోలేదు. ఎందుకంటే, కేంద్రం ప్రకటించింది కేవలం ప్రత్యేకసాయం మాత్రమే, ప్రత్యేకప్యాకేజి కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. చట్టబద్దత లేనిదే కేంద్రం ఏ విషయంలోనూ సాయం చేయదన్న విషయం చంద్రబాబుకు తెలీదా?
తాను ప్రకటించని ప్రత్యేకప్యాకేజికి చట్టబద్దత కల్పించాలని చంద్రబాబు ఎన్నిమార్లు అడిగినా కేంద్రం పట్టించుకోకపోవటానికి కారణం అదే. అంటే కేంద్రం ప్రకటించింది ఒకటైతే, చంద్రబాబు అడుగుతున్నది ఇంకోటన్న విషయం అర్ధమైపోతోంది. విభజన చట్టంలో పేర్కొన్న ప్రత్యేకహోదాకే దిక్కులేకపోతే కేవలం నోటిమాటగా చెప్పిన ప్రత్యేకసాయానికి ఇంకేమిటి దిక్కు. ఇంతచిన్న విషయం చంద్రబాబుకు తెలీదా? ఎందుకు తెలీదు. కానీ తెలీనట్లు నాటాకాలాడుతున్నారు.
అందులోనూ నీటిపారుదల ప్రాజెక్టుల అంచనా వ్యయాలను వేల కోట్లరూపాయలకు పెంచుకుంటూ పోతుంటే కేంద్రమే కాదు ఎవరు మాత్రం నిధులిస్తారు? నీటిపారుదల ప్రాజెక్టుల అంచనాల పేరుతో జరుగుతున్న తతంగమంతా కేంద్రానికి తెలీకుండానే ఉంటుందా? అందుకే పట్టించుకోవటం లేదు.