ముద్రగడ వ్యతిరేకులను చంద్రబాబు బాగానే దువ్వుతున్నారు

First Published Aug 13, 2017, 2:12 PM IST
Highlights
  • ముందుజాగ్రత్తగా ముద్రగడ పిలుపుకు విరుగుడుగా చంద్రబాబు రంగంలోకి దిగారు.
  • ఎప్పుడైతే, ముద్రగడ పిలుపిచ్చారో టిడిపిలో ఆందోళన మొదలైంది.
  • అందుకనే పార్టీలోని కాపు నేతలను చంద్రబాబునాయుడు దువ్వారు.
  • దాని ఫలితమే 13 జిల్లాల కాపు నేతలతో ప్రభుత్వం సమావేశమవుతోందని ప్రచారం మొదలైంది.

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పిలుపుకు వ్యతిరేకంగా ప్రభుత్వం పావులు కదుపుతోంది. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో టిడిపికి వ్యతిరేకంగా ఓట్లు వేయాల్సిందిగా ముద్రగడ మూడు రోజుల క్రితం పిలుపిచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికలు జరుగుతున్న రెండు చోట్లా కాపుల సంఖ్య గణనీయంగా ఉంది. గెలుపోటములను నిర్ణయించే స్ధాయిలో కాపుల ఓట్లున్నది వాస్తవం. నంద్యాలలో బలిజ (కాపు) ఓట్లు 26 వేలు కాగా కాకినాడలో సుమారు 50 వేలుంటారు. సరే, ముద్రగడ మాట ఎంతమంది వింటారన్న విషయం వేరే సంగతి. ఎందుకైనా మంచిదని ముందుజాగ్రత్తగా ముద్రగడ పిలుపుకు విరుగుడుగా చంద్రబాబు రంగంలోకి దిగారు.

ఎప్పుడైతే, ముద్రగడ పిలుపిచ్చారో టిడిపిలో ఆందోళన మొదలైంది. అందుకనే పార్టీలోని కాపు నేతలను చంద్రబాబునాయుడు దువ్వారు. దాని ఫలితమే 13 జిల్లాల కాపు నేతలతో ప్రభుత్వం సమావేశమవుతోందని ప్రచారం మొదలైంది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడు పిళ్ళా వెంకటేశ్వరరావు పేరుతో ఓ సర్క్యులర్ ప్రచారంలోకి వచ్చింది. ‘చంద్రబాబు, మంత్రులు సమావేశమై కాపు రిజర్వేషన్ పై మంచి శుభవార్త తెలియజేసే నిర్ణయం తీసుకుంటార’ని పిళ్ళా ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదే విషయమై సొమవారం విజయవాడలోని ది వెన్యూ ఫంక్షన్ హాలులో సమావేశమవుతున్నట్లు కూడా పిళ్ళా చెప్పారు. చంద్రబాబు, మంత్రులు హాజరవుతున్న సమావేశానికే కాపు నేతలందరూ హాజరవ్వాలని పిళ్ళా ఆహ్వనం కూడా పంపారు. కాకినాడ సంగతి పక్కన పెడితే నంద్యాలలో గెలుపుకు మాత్రం టిడిపి నానా అవస్తలు పడుతోందన్నది వాస్తవం. ముద్రగడ పిలుపుకు కాపులు సానుకూలంగా స్పందిస్తే టిడిపి పుట్టి ముణగటం ఖాయం. అందుకనే హడావుడిగా ముద్రగడ వ్యతిరేక బ్యాచ్ ను చంద్రబాబు దువ్వుతున్నారని స్పష్టమైపోతోంది. పిళ్ళా చెబుతున్నట్లు సోమవారం చంద్రబాబు ప్రకటించబోయే శుభవార్త ఏంటో చూద్దాం.  

click me!