నిద్ర నటించేవారిని లేపగలరా?

First Published Jun 6, 2017, 8:16 AM IST
Highlights

నిజంగానే కేంద్రానికి భయపడకపోతే ప్రత్యేకహోదా, ప్రత్యేక రైల్వేజోన్ లాంటి అంశాలపై కేంద్రాన్ని ఎందుకు నిలదీయలేకపోతున్నారు. ప్రత్యేకహోదా కావాలంటూ పార్లమెంట్ లో ప్రతిపక్షాలు నానా గొడవా చేస్తుంటే పట్టించుకోకపోగా వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారు?

నిద్రపోయేవాడిని లేపవచ్చు కానీ నటిస్తున్న వాడిని లేపలేరనేది ఓ సామెత. చంద్రబాబునాయుడు చేస్తున్నది అదే.  ఎవరైనా ప్రత్యేకహోదా గురించి మాట్లాడితే చాలు పూనకం వచ్చినట్లు ఊగిపోతారు. ప్రత్యేకహోదా వల్ల వచ్చే ఉపయోగాలేమిటో చెప్పాలని, తాను తెలుసుకుంటానని తరచూ చెబుతుంటారు. జగన్ మాట్లాడినా, కాంగ్రెస్ మాట్లాడిన అదే వరస. తాజాగా గుంటూరులో కాంగ్రెస్ సభ తర్వాత మళ్ళీ అవే మాటలు రిపీట్ చేస్తున్నారు.

ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తుందా ఇవ్వదా అన్నది వేరే విషయం. అసలంటూ కావాలని డిమాండ్ చేయాలికదా? ఇక్కడే చంద్రబాబుతో సమస్య వస్తోంది. తాను అడగరు, అడిగేవారికి అడ్డుపడుతున్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా నరేంద్రమోడి సర్కార్ ఇవ్వదన్న విషయం అర్ధమైపోయింది. దానికితోడు ‘ఓటుకునోటు’ కేసు పుణ్యమా అంటూ ఏ విషయంలో కూడా కేంద్రాన్ని డిమాండ్ చేసే సీన్ చంద్రబాబుకు లేకుండా పోయింది.

వాస్తవాలు కళ్ళకు కట్టినట్లు కనబడుతుంటే, చంద్రబాబేమో ‘దేశంలో తానే సీనియర్నని, ఎవరికీ భయపడను’ అంటూ కథలు చెబుతున్నారు. నిజంగానే కేంద్రానికి భయపడకపోతే ప్రత్యేకహోదా, ప్రత్యేక రైల్వేజోన్ లాంటి అంశాలపై కేంద్రాన్ని ఎందుకు నిలదీయలేకపోతున్నారు. ప్రత్యేకహోదా కావాలంటూ పార్లమెంట్ లో ప్రతిపక్షాలు నానా గొడవా చేస్తుంటే పట్టించుకోకపోగా వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారు?

చంద్రబాబును కేంద్రం పట్టించుకోవటం లేదన్నది వాస్తవం. కాబట్టే రాష్ట్రానికి న్యాయబద్దగా రావాల్సినవి కూడా రావటం లేదు. కేంద్రంతో గొడవలు పెట్టుకుంటే ఓటుకునోటు కేసులో ఏమౌతుందో అని చంద్రబాబు భయం. ప్రత్యేకహోదా వల్ల రాష్ట్రానికి జరిగే మేళ్ళు ఏమటిన్నది గతంలో జగన్ తో సహా చాలామంది ప్రతిపక్ష నేతలు విడమరచిచెప్పారు. వారితో చంద్రబాబు విభేదిస్తున్నారు. ఎందుకంటే, నారా వారు నిద్రనటిస్తున్నారు కాబట్టి. జనాలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. సమయం వచ్చినపుడు వారే చంద్రబాబును నిద్రలేపుతారు.

click me!