
తెలంగాణాకు చెందిన సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు కోసం చంద్రబాబునాయుడు లాబీయింగ్ మొదలుపెట్టారు. ఢిల్లీ పర్యటనలో తనతో పాటు నరసింహులును కూడా చంద్రబాబు తీసుకెళ్లటమే ఇందుక నిదర్శనమంటూ టిడిపి వర్గాలే అంటున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఏదో ఒక రాష్ట్రానికి మోత్కుపల్లిని గవర్నర్ గా నియమించేట్లు చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు నరసింహులే చెప్పుకున్నారు. అదే విషయాన్ని నరసింహులు పలుమార్లు బహిరంగ సభల్లో కూడా ప్రస్తావించారు. దానికితోడు కేంద్రం వివిధ రాష్ట్రాలకు గవర్నర్లను నియమించినపుడల్లా మోత్కుపల్లి పేరు తెరపైకి వస్తూనే ఉంది. ఒక వర్గం మీడియా అయితే, ఏ రాష్ట్రానికి మోత్కుపల్లి గవర్నర్ గా వెళుతున్నారో ప్రచారం కూడా చేయటం విచిత్రం.
అయితే నరసింహులు ఆశించినట్లు, ప్రచారం జరిగినట్లు మూడేళ్ళయినా ఏ రాష్ట్రానికీ గవర్నర్ గా నియమితులు కాలేదు. దాంతో మోత్కుపల్లిలో అసహనం పెరిగిపోతోంది. ఈ విషయం కూడా పలుమార్లు బాహాటంగానే ప్రదర్శించారు. దాంతో ఒత్తిడి పెరిగిపోయిన చంద్రబాబు నరసింహులును తనతో పాటు తాజాగా ఢిల్లీకి వెళ్లినట్లున్నారు. అమిత్ షా, వెంకయ్యనాయడును చంద్రబాబు కలిసినపుడు నరసింహులు కూడా చంద్రబాబు వెంట వుండటంతో లాబియింగ్ ప్రచారానికి మరింత మద్దతు లభించినట్లైంది.
ప్రస్తుతానికి తెలంగాణాలో చంద్రబాబుకు ఎటువంటి పట్టు లేదన్నది వాస్తవం. ఎందుకంటే, తెలంగాణాలో పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. ప్రజాప్రతినిధుల్లో అత్యధికులు టిఆర్ఎస్ లో కలిసిపోయారు. అధికారంలో ఉన్న టిఆర్ఎస్ తెలంగాణాలో చంద్రబాబును నోరెత్తనీయకుండా చేస్తున్నది. దానికి తగ్గట్లే ప్రతిపక్షంలో కూడా పార్టీకి అంత సీన్ లేదు. పైగా మిత్రపక్షం భాజపాతో పెద్దగా సంబంధాలు కూడా లేవు. ఈ పరిస్ధితుల్లో తెలంగాణా టిడిపిలో ఎవరినో ఒకరిని ఏదో ఒక కీలక స్ధానంలో పెట్టుకోకపోతే చంద్రబాబుకు ఇబ్బందులే. అందుకనే ఏదో ఒక రాష్ట్రంలో వెంటనే గవర్నర్ పోస్టు ఇప్పించుకోవాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందుకనే నరసింహులు తరపున గట్టిగా లాబీయింగ్ మొదలుపెట్టారు.