ఇపుడేమి చేయాలి?

First Published Dec 19, 2016, 1:52 AM IST
Highlights

మంత్రులు, ఎంఎల్ఏలు నియోజకవర్గాల్లో తిరుగుతున్నపుడు ప్రజల నుండి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

ఇపుడేమి చేయాలన్నదే చంద్రబాబునాయడు ముందున్న ప్రశ్న? నోట్ల రద్దు తదనంతర పరిణామాలపై ప్రజల్లో లాగే పార్టీలో కూడా అసంతృప్తి పెరిగిపోతోంది. డిజిటల్ జపం చేయకుండా సరిపడా కరెన్సీని తెప్పించాల్సిందేనంటూ సిఎంపై మంత్రులు, ఎంఎల్ఏలు ఒత్తిడి తీవ్రతరం చేస్తున్నట్లు సమాచారం.

 

పెద్ద నోట్ల రద్దు తర్వాత రాష్ట్రంలో పరిస్ధితులు అధ్వాన్నంగా తయారైంది. మంత్రులు, ఎంఎల్ఏలు నియోజకవర్గాల్లో తిరుగుతున్నపుడు ప్రజల నుండి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

 

ఈ పరిస్ధితుల్లో సరిపడా కరెన్సీ వచ్చే అవకాశాలు లేకపోవటంతో చంద్రబాబు డిజిటల్ లావాదేవీల పల్లవి అందుకున్నారు. అయితే, తాను అనుకుంటే సరిపోతుందా? ప్రజలూ మారద్దూ? మారటానికి టైం పడుతుంది. ఈలోపు పుణ్యకాలం అయిపోతుంది. దాంతో ఏమి చేయాలో సిఎం అర్ధం కావటం లేదు.

 

దానికితోడు త్యాగాలు చేయాలని మోడి చెప్పిన 50 రోజుల గడువులో ఇప్పటికే 40 రోజులైపోయింది. పరిస్ధితుల్లో మార్పు రాకపోగా మరింత అధ్వాన్నంగా తయారౌతోంది. సమీప భవిష్యత్తులో పరిస్ధితులు మారుతాయన్న నమ్మకం కూడా ప్రజల్లో కనబడటం లేదు.

 

ఈ నేపధ్యంలోనే  చంద్రబాబు మొన్న మంత్రులు, ఎంఎల్ఏలతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహిచారు. అందులో పాల్గొన్న వారంతా డిజిటల్ లావాదేవీల ప్రస్తావన తేవద్దని గట్టిగా చెప్పారు.

 

తమ ఊర్లలో డిజిటల్ లావాదేవీల గురించి మాట్లాడుతుంటే ప్రజలు మండిపడుతున్నారంటూ పలువురు చంద్రబాబుకు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. డిజిటల్ లావాదేవీల గురించి మాట్లాడటం మానేసి కేంద్రంపై ఒత్తిడి పెట్టైనా సరే అవసరాల మేరకు డబ్బే తెప్పించాల్సిందేనంటూ చంద్రబాబుకు స్పష్టంగా చెప్పారు. దాంతో చంద్రబాబులో ఆందోళన స్పష్టంగా కనబడుతోంది.

 

వచ్చిన ఫీడ్ ఆధారంగానే చంద్రబాబు ఆర్బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తో మాట్లాడారు. ప్రజలు సహనంగా ఉన్నారంటే కేవలం 50 రోజుల తర్వాత పరిస్ధితులు మారుతాయన్న నమ్మకంతోనే అని ఉర్జిత్ తో చెప్పారు.

 

 ప్రజల సహనాన్ని అలుసుగా తీసుకోవద్దని హెచ్చరించారు. అవసరాలకు సరిపడా డబ్బులు ప్రజలకు అందకపోతే ఈ నెలాఖరుకల్లా ప్రజల్లో అసహనం పెరిగిపోతుందని చెప్పటం గమనార్హం.

click me!