
ప్రముఖ మీడియా సంస్ధ ఇండియా టు డే చంద్రబాబునాయుడు గాలి తీసేసింది. ఇండియా టు డే ఆధ్వర్యంలో చెన్నైలో జాతీయ సదస్సు జరిగింది. దీనికి చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి వెంకయ్యనాయడు, కేరళ ముఖ్యమంత్రి పినరపి విజయ్, డిఎంకె కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. అపుడు ఇండియా టు డే తరపున రాజ్ దీప్ సర్దేశాయ్ చంద్రబాబును ఇంటర్వ్యూ చేసారు.
ఆ సందర్భంగా రాజ్ దీప్ అడిగిన కొన్ని ప్రశ్నలకు చంద్రబాబు తీవ్ర అసహనం పాలయ్యారు. ‘ఒకవైపు క్లీన్ ఇండియా, కరప్షన్ ఫ్రీ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్న మీరు ప్రతిపక్షాన్ని విడగొట్టి.. మీ పార్టీని నిర్మించుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు’? అని చంద్రబాబును రాజ్ దీప్ ప్రశ్నించారు. దాంతో సిఎం ఖంగుతిన్నారు. అంతమంది ముందు తనను ఓ జర్నలిస్టు రాష్ట్రంలో తన పార్టీ అవలంభిస్తున్న విధానాన్ని ఎత్తి చూపటాన్ని తట్టుకోలేకపోయారు.
‘కరప్షన్ ఫ్రీ ఇండియా గురించి మాట్లాడే మీరు ప్రతిపక్ష ఎంఎల్ఏలను ఎందుకు కొనుగోలు చేస్తున్నార’టూ వేసిన మరో ప్రశ్నకు ఉక్కిరిబిక్కిరయ్యారు. ‘మీరేమో క్లీన్ ఇండియా అని, ఆదర్శ రాజధానిని నిర్మిస్తానని చెబుతున్నారు. మీపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలున్నాయ’ని ప్రశ్నించగానే తీవ్రంగా మండిపడ్డారు.
తన ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఉందని, ప్రతిపక్ష ఎంఎల్ఏలను కొనుగోలు చేయాల్సిన అవసరం ఏమిటని ఎదురు ప్రశ్నించారు. ఇక, రాజధాని నిర్మాణాన్ని సిఆర్డిఏ పర్యవేక్షిస్తుండగా అవినీతికి ఆస్కారం ఎక్కడిదని ప్రశ్నించారు. పైగా తనకు గతంలో రెండుసార్లు ప్రధానమంత్రిగా అవకాశం వచ్చినా నిరాకరించానని పొంతనలేని సమాధానం చెప్పటం గమనార్హం.