
చూడబోతే చంద్రబాబునాయుడు చాలామందికి లైసెన్సులు ఇచ్చేసినట్లే ఉన్నారు. కొందరు ప్రభుత్వ అధికారులనే కొడతారు. మరికొందరు ప్రభుత్వ భూములకే టెండర్ పెడతారు. ఇంకొంతమంది ప్రైవేటు భూములను కూడా కబ్జా చేస్తారు. ఇక, బ్యాంకుల్లో వందల కోట్ల రూపాయలు రుణాలు తీసుకుని ఎగ్గొట్టటం సరే సరి.
ఇంతకీ విషయమేమిటంటే, విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి టిడిపి ఎంఎల్ఏ పీలా గోవింద్ పెందుర్తిలోని ఓ ప్రైవేటు భూమిని దర్జాగా కబ్జా చేసారు. ఒమన్ లో ఉంటున్న రాజేష్ బాబు అనే వ్యక్తికి చెందిన ఓ ఇంటి స్ధలంలో రమాదేవి అనే మహిళ ఉంటున్నారు. ఖాళీ స్ధలంలోనే కొంత భాగం ఇల్లుకుడా ఉందిలేండి.
మన ఎంఎల్ఏ గారి అనుచరుల కన్ను ఆ స్ధలంపై పడింది. వెంటనే విషయాన్ని పీలా చెవిన వేసారు. ఎటువంటి అండా లేని మహిళ కావటంతో వెంటనే ఎంఎల్ఏ అనుచరులు రంగంలోకి దిగేసారు. స్ధలాన్ని వెంటనే ఖాళీ చేయాలని అల్టిమేటం జారీ చేసారు. అయితే, మహిళ అడ్డుతిరిగింది.
దాంతో ఏకంగా పీలానే రంగంలోకి దిగారు. టిప్పర్లతో రంగ ప్రవేశం చేసిన ఎంఎల్ఏ స్ధలానికి ఉన్న ప్రహరిగోడను కూలగొట్టేసారు. దాంతో భయపడిన సదరు మహిళ వెంటనే విషయాన్ని రాజేష్ కు చేరవేసింది. దాంతో రాజేష్ ఒమన్ నుండే విశాఖపట్నం సిటీ కమిషనర్ కు విషయం మొత్తాన్ని ఇమైల్ ద్వారా తెలియజేయటమే కాకుండా ఎంఎల్ఏపై ఫిర్యాదు కూడా చేసారు.
దాంతో కమిషనర్ విషయం మొత్తాన్ని విచారించారు. ఎంఎల్ఏ కబ్జా వ్యవహారం బయటపడింది. దాంతో వెంటనే పెందుర్తి పోలీసులకు ఆదేశాలు జారీ చేసారు. దాంతో ఎంఎల్ఏ పీలా గోవింద్, ఆయన కుమారుడు శ్రీధర్ తో పాటు అనుచరులపై పెందుర్తి పోలీసులు భూ కబ్జా కేసును నమోదు చేసారు. ఇంతకీ పోలీసులు అంత ధైర్యంగా అధికార పార్టీ ఎంఎల్ఏపై భూకబ్జా కేసును ఎలా నమోదు చేసారో ?