
కోడలికి బుద్ది చెప్పి అత్త తెడ్డునాకిందని వెనకో సామెతలాగుంది తెలుగుదేశం పార్టీ వ్యవహారం. రాష్ట్రం ఏర్పడి మూడేళ్ళవుతున్నా ఇంకా హైదరాబాద్లోని లోటస్ పాండ్ నుండే రాజకీయాలు చేస్తున్నారంటూ టిడిపి నేతలు జగన్ పై తరచూ విమర్శలు, ఆరోపణలు చేస్తుంటారు. మరి అదే పనిని ఇపుడు చంద్రబాబునాయుడు కూడా చేయబోతున్నారు. హైదరాబాద్, జూబ్లీహిల్స్ లోని తన పాత ఇంటిని కూలగొట్టి కొత్త ఇంటిని కడుతున్నారు కదా. ఆ ఇంటి నిర్మాణం పూర్తయిపోయిందట. ఈనెల 9వ తేదీన గృహప్రవేశం కూడా చేస్తున్నాట. తర్వాత సత్యనారాయణ వ్రతం కూడా ఎలాగూ ఉంటుంది.
ఇపుడు దానిపైనే సర్వత్రా చర్చ మొదలైంది. అంటే, కొత్తగా కట్టించుకున్న ఇంటిలో చంద్రబాబు కుటుంబసభ్యులుంటారు. ముఖ్యమంత్రి, మంత్రి హోదాలో చంద్రబాబు, లోకేష్ లు విజయవాడ-హైదరాబాద మధ్య ఎప్పుడు కావాలంటే అపుడు ఎంచక్కా వస్తూ పోతూండవచ్చన్నమాట. అఫ్ కోర్స్ ఈ ఇద్దరూ ఇపుడు చేస్తున్నది కూడా అదే అనుకోండి. ఇకా సిఎం హోదాలో చంద్రబాబుకు ఎక్కడ కావాలంటే అక్కడ క్యాంపు కార్యాలయాలను పెట్టుకుని అవకాశం ఉంది. జగన్ కు ఆ అవకాశం లేదు. ఎక్కడ ఇల్లు తీసుకోవాలన్నా పార్టీనే ఖర్చలు భరించాలి. అందుకనే రాష్ట్రంలో ఏ సమస్యపై ఎక్కడ తిరుగుతున్నా వెంటనే జగన్ హైదరాబాద్ కు చేరుకుంటున్నారు.
రాష్ట్ర రాజకీయాలపై ఎప్పుడు చర్చ జరిగినా జగన్ ఉదంతాన్నే టిడిపి నేతలు బూతద్దంలో చూపిస్తూ విమర్శలు గుప్పిస్తుంటారు. జగన్ కు రాష్ట్రం మీద ప్రేమలేదని, బాధ్యత లేదని ఏవేవో అంటుంటారు. హైదరాబాద్ ను వదిలి రాలేకపోతున్నారని కూడా అంటూంటారు. హైదరాబాద్ ను పరాయిగడ్డగా భావిస్తున్న చంద్రబాబు విజయవాడలోనే ఓ ఇంటిని ఎందుకు నిర్మించుకోలేదు? హైదరాబాద్ లోనే ఎందుకు మళ్ళీ కట్టుకున్నారు? అంటే, చంద్రబాబు, లోకేష్ చేస్తే ఒప్పు, జగన్ చేస్తే మాత్రం తప్పు. ఎలాగుంది టిడిపి నేతల నీతిసూత్రాలు.