
అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైసిపి మధ్య ఇపుడు పప్పు గొడవ మొదలయింది.
‘కొత్తగా మంత్రి అయిన లోకేష్ బాబుని పప్పు.. ఆర్ అండ్ బి మంత్రి అయ్యన్న ఎర్రిపప్పు’ అని వైసీపీ నగరి ఎమ్మెల్యే ఆర్ కె రోజా వ్యాఖ్యానించడం పట్ల మంత్రి అయ్యన్న పాత్రుడు ఆవేదనవ్యక్తం చేశారు.
రోజా చేసిన వ్యాఖ్యలపై మంత్రి అయ్యన్న పాత్రుడు ఈ రోజు కౌంటర్ ఇచ్చారు.
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ముద్దపప్పు, ఎర్రిపప్పు కన్నా నీచమైన భాష మాట్లాడగలను,’ అని ఆయన అన్నారు.
"రోజాకు ఆలోచించే శక్తి లేదు.. అసలు ఆమెకు బుర్రే లేదు" అని అయ్యన్న అన్నారు.
రాజ్యాంగం, రాజకీయం గురించి రోజా మాట్లాడటం ఏంటో అర్థం కాలేదని ఆయన అన్నారు.
రోజా, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని బతకడం నేర్చుకో అంటూ ఆయన హితవు పలికారు.
ఇంతకంటే రోజా గురించి ఎక్కువ మాట్లాడటం కూడా మంచిది కాదని అయ్యన్న చెప్పుకొచ్చారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్.. టీడీపీ ఎమ్మెల్యేలను ఆకర్ష్ పేరు మీద తీసుకుని మంత్రి పదవులు ఇచ్చినప్పుడు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఎక్కడికి పోయారు, ఎందుకు మాట్లాడలేకపోలేదో రోజా చెప్పాలని అడిగారు.
అప్పుడంతా ఎందుకు మాట్లాడ లేక పోయారు, అప్పుడెందుకు రాష్ట్రపతిని కలవలేదంటూ సూటి ప్రశ్నలు సంధించారు.
‘ ఇపుడు అకస్మాత్తుగా జగన్‌కు ప్రజాస్వామ్యం గుర్తొచ్చిందా.. ఇప్పుడు అన్యాయం జరిగిందని ఆలోచిస్తున్నారా,’ అంటూ అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.