రెండు రోజులు చంద్రబాబు బ్యాటింగే సరిపోయింది

First Published Sep 22, 2017, 7:18 AM IST
Highlights
  • మొత్తానికి చంద్రబాబునాయుడు రెండు రోజుల వన్ సైడ్ బ్యాటింగ్ అయిపోయింది.
  • చంద్రబాబు ఎప్పుడు సదస్సులు నిర్వహించినా జరిగేదంతే.
  • కలెక్టర్లు, ఎస్పీలను రెండు రోజుల పాటు సదస్సులని పిలవటం తల వాచిపోయేట్లు గంటల తరబడి చెప్పిందే చెప్పి పంపటం.
  • ఎంతసేపూ తన పనితీరు బ్రహ్మాండమని డప్పేసుకోవటం, ఒకళ్ళో ఇద్దరు మంత్రులను అందరి ముందు ఘాటుగా మాట్లాడటం పెద్ద ప్రహసనమైపోయింది.

మొత్తానికి చంద్రబాబునాయుడు రెండు రోజుల వన్ సైడ్ బ్యాటింగ్ అయిపోయింది. చంద్రబాబు ఎప్పుడు సదస్సులు నిర్వహించినా జరిగేదంతే. కలెక్టర్లు, ఎస్పీలను రెండు రోజుల పాటు సదస్సులని పిలవటం తల వాచిపోయేట్లు గంటల తరబడి చెప్పిందే చెప్పి పంపటం. ఎంతసేపూ తన పనితీరు బ్రహ్మాండమని డప్పేసుకోవటం, ఒకళ్ళో ఇద్దరు మంత్రులను అందరి ముందు ఘాటుగా మాట్లాడటం పెద్ద ప్రహసనమైపోయింది. తాజాగా వంతు గంటా శ్రీనివాసరావుది. సదస్సుకు రావాలంటేనే ఉన్నతాధికారులు బెంబేలెత్తిపోతున్నారంటూ అతిశయోక్తి కాదు.

గడచిన మూడున్నరేళ్ళుగా కలెక్టర్లు, ఎస్పీలతో పాటు ఇతర ఉన్నతాధికారులకు ఇది బలవంతపు తద్దినమైపోయింది. ఎంతసేపు తాను మాట్లాడటమే కానీ ఎదుటి వారికి మాట్లాడే అవకాశం మాత్రం చంద్రబాబు ఇవ్వరు. ఇపుడు జరిగింది కూడా అదే. రెండు రోజుల్లో అనేక అంశాలపై చంద్రబాబు సుదీర్ఘంగా ఉపన్యాసాలిచ్చారు. క్షేత్రస్ధాయిలో ఏమి జరుగుతోందో అన్న విషయాలను వివరించటానికి కలెక్టర్లకు గానీ ఎస్పీలకు గానీ ఇపుడు కూడా అవకాశం రాలేదు. చంద్రబాబు చెప్పింది విన్నారు సదస్సు అయిపోయిందనగానే బ్రతుకుజీవుడా అంటూ ఊపిరిపీల్చుకున్నారు.

నిజానికి చంద్రబాబు వినదలుచుకుంటే క్షేత్రస్ధాయిలో చాలా సమస్యలే ఉన్నాయి. రెండు రోజుల సదస్సు నిర్వహించినపుడు క్షత్రస్ధాయిలో పనిచేసే కలెక్టర్లు, ఎస్పీలనే మాట్లాడించాలి. అందరూ మాట్లాడిన తర్వాత వారికి దిశానిర్దేశం చేస్తే బాగుంటుంది. అయితే, సమస్యలను వినటానికి చంద్రబాబు ఎప్పుడూ ఇష్టపడరన్న విషయం అందరికీ తెలిసిందే కదా? ఇపుడు కూడా ప్రజల్లో 100 శాతం సంతృప్తి వచ్చేందుకు కలెక్టర్లు కష్టపడాలట. ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలంగా ఉండేట్లు చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదేనట. ఇదొక్కటే చంద్రబాబు చెప్పిన కొత్త విషయం. అర్హులైన పేదలకందరికీ సంక్షేమ పథకాలు అందాలట. కామిడీ కాకపోతే లబ్దిదారుల ఎంపిక జన్మభూమి కమిటీలకు కట్టబెట్టిన తర్వాత అర్హులందరికీ లబ్ది  ఎలా అందుతుంది?

ఎదుటివారితో గంటల తరబడి మాట్లాడటమన్నది చంద్రబాబు బలహీనత. విషయం లేకపోయినా ఎంతసేపన్నా మాట్లాడటం కూడా ఓ కళే. అందులో చంద్రబాబు పిహెచ్ డి చేసేసారెప్పుడో. అందుకనే చంద్రబాబు ఎప్పుడు సదస్సులన్నా మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలందరూ మానసికంగా రెండు రోజుల వాయింపులకు మానసికంగా సిద్ధపడిపోతున్నారు.

click me!