సామాజికవర్గాలను దూరం చేసుకుంటున్నారా?

First Published Jun 21, 2017, 10:45 AM IST
Highlights

చంద్రబాబు చదరంగంలో ముందు కాపులు, తర్వాత బిసిలు, మధ్యలో ఎస్సీలు ఇపుడు బ్రాహ్మణులు పావులైపోయారు. కేవలం తన అధికారాన్ని నిలుపుకునేందుకు, అధికారాన్ని అందుకునేందుకు చంద్రబాబు ఏ స్ధాయికైనా దిగజారుతారని చెప్పటానికి సామాజికవర్గాల్లో రేగుతున్న అలజడులే ప్రత్యక్ష ఉదాహరణ.

పోయిన ఎన్నికల్లో ఓట్లు వేసిన సామాజికవర్గాలను చంద్రబాబునాయుడు దూరం చేసుకుంటున్నారా? జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అవుననే అనిపిస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో చంద్రబాబు వైఖరి పార్టీ నేతలకు మింగుపుపడటం లేదు. చంద్రబాబు చదరంగంలో ముందు కాపులు, తర్వాత బిసిలు, మధ్యలో ఎస్సీలు ఇపుడు బ్రాహ్మణులు పావులైపోయారు. కేవలం తన అధికారాన్ని నిలుపుకునేందుకు, అధికారాన్ని అందుకునేందుకు చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారని చెప్పటానికి ఆయా సామాజికవర్గాల్లో రేగుతున్న అలజడులే ప్రత్యక్ష ఉదాహరణ.

పోయిన ఎన్నికల్లో అధికారం అందుకోవటమే లక్ష్యంగా కాపులను బిసిల్లో చేరుస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను మరచిపోయారు. దాంతో కాపుల్లో అలజడి రేగింది. ఎప్పుడైతే కాపుల్లో ఆందోళన మొదలైందో వెంటనే వారికి వ్యతిరేకంగా బిసిలను రెచ్చగొట్టారు. దాంతో సమస్య కాపు-బిసిల మధ్య నలుగుతోంది. ఇచ్చిన హామీఏమో చంద్రబాబు. హామీని నెరవేర్చమని అడుగుతున్న కాపులు సంఘవిద్రోహులైపోయారు. ముద్రగడ పద్మనాభం తదితరులపై నమోదైన కేసులే అందుకు ఉదాహరణ. దాంతో మెజారిటి కాపులు చంద్రబాబుపై మండిపోతున్నారు. దాంతో కాపులు ఎప్పుడు ఉద్యమం అన్నా వారికి వ్యతిరేకంగా రాయలసీమలో బలిజలను రెచ్చగొడుతున్నారు.

ఎస్సీ వర్గీకరణ పేరుతో గతంలోనే చంద్రబాబు మాల-మాదిగల మధ్య చిచ్చుపెట్టారు. అది ఇప్పటికీ చల్లారలేదు. ఎన్నికలు దగ్గర పడుతున్న కారణంగా మాదిగలు మళ్ళీ రోడ్డెక్కుతున్నారు. మాదిగలను నియమంత్రించేందుకు మాలలను ఉసిగొల్పుతున్నారు. దాంతో మాల-మాదిగల మధ్య గొడవలు మొదలవుతున్నాయ్. హక్కుల కోసం పోరాడుతున్న మాదిగలను పోలీసు బలంతో అణిచివేస్తున్నారు, కేసులు పెట్టి రెచ్చగొడుతున్నారు.

తాజాగా బ్రాహ్మణ కార్పొరేష్ ఛైర్మన్ గా పనిచేసిన ఐవైఆర్ కృష్ణారావు తొలగింపు వివాదం. ఐవైఆర్ తొలగింపు వివాదం రెండురోజులుగా రాష్ట్రంలో ప్రముఖమైపోయింది. కృష్ణారావుకు అనుకూలంగా, వ్యతిరికేంగా బ్రాహ్మణ సంఘాల్లో చీలిక కనిపిస్తోంది. ప్రభుత్వంకు అనుకూలంగా ఉండేవారు, చంద్రబాబు నుండి ఏదో ఆశిస్తున్న వారంతా ఐవైఆర్ తొలగొంపును సమర్ధిస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధం లేని మిగిలిన వారంతా ప్రభుత్వం తీరును తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. అప్పుడే చంద్రబాబుకు వ్యతిరేకంగా అనేక ప్రాంతాల్లో బ్రాహ్మణ సంఘాలు సమావేశమవుతున్నాయి.

పోయిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పుణ్యమా అని బ్రాహ్మణ ఓట్లు టిడిపికి పడ్డాయన్నది వాస్తవం. వచ్చే ఎన్నికల్లో భాజపా-టిడిపి మధ్య పొత్తున్నా లేకపోయినా బ్రాహ్మణుల ఓట్లు టిడిపికి పడే అవకాశాలు తక్కువ. ఈ నేపధ్యంలోనే బ్రాహ్మణ సమాజాన్ని టిడిపికి అనుకూలంగా ఐవైఆర్ చంద్రబాబు మలుస్తారని అనుకున్నారు. అందుకు కృష్ణారావు కుదరదని చెప్పారు. దాంతో ఆయన్ను అవమానకరంగా ఛైర్మన్ పదవి నుండి తొలగించారన్నది అర్ధమవుతోంది.

 

 

click me!